Pawan Kalyan Effect: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో రోడ్లు చెడిపోయాయి. నడవడానికి కూడా వీల్లేకుండా పోయాయి. దీంతో ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. రోడ్ల దుస్థితిపై నిలదీస్తున్నాయి. అధికార పక్షం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నాయి. రోడ్ల మరమ్మతుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. దీంతో రోడ్ల పరిస్థితిని ప్రభుత్వం కళ్లకు కట్టేలా చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. వర్షాకాలం ముగిసిన వెంటనే రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ (CM Jagan) ఆదేశించారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణంపై సీఎం జగన్ తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
వచ్చే అక్టోబర్ కల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయన్నారు. తరువాత పనుల కాలం మొదలవుతున్నందున రోడ్లు బాగు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు రోడ్లన్నీ బాగా మెరవాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా విడిచిపెట్టిందని చెప్పారు. మన ప్రభుత్వంలో వర్షాలు కూడా బాగా పడుతున్నాయని అన్నారు. అందుకే రోడ్లు మరమ్మతులకు గురవుతున్నాయని వివరించారు.
రోడ్ల మరమ్మతుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రోడ్లు బాగు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ర్టంలో ఎల్లో మీడియాతో చిక్కులు వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు అధికారంలో లేకపోయే సరికి వారు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రతిపక్షాలపై జగన్ విరుచుకుపడ్డారు. వారు చేసే పనులను తప్పుబట్టారు.
సీఎం పీఠం దూరమయ్యే సరికి బాబు ఓర్చుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రతి విషయాన్ని వక్రీకరిస్తూ బూతద్దంలో పెట్టి చూస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనులకు సైతం అడ్డు వస్తున్నారని ఎద్దేవా చేశారు. నెగెటివ్ మీడియా ఎన్ని వార్తలు రాసినా మనం పట్టించుకోవద్దని సూచించారు. రోడ్ల బాగు కోసం ఇదివరకే టెండర్లు పిలిచామని వివరించారు. అక్టోబర్ లో వర్షాకాలం ముగిసిపోయే అవకాశం ఉన్నందున ఆ తరువాత పనులు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.