టాలీవుడ్ నిర్మాతల తీరును జనసేనాని పవన్ కళ్యాణ్ ఎండగట్టారు. ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతున్న సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానంపై నిర్మాతలు తన దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటేనే రిపబ్లిక్ వేడుకలో సిని పరిశ్రమ ఇబ్బందులపై మాట్లాడానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా దగ్గరకు వచ్చి నిర్మాతలు ఏపీ ప్రభుత్వం తీరుపై వాపోయారని.. ఆన్ లైన్ సినిమా టికెట్ల వల్ల తమ జుట్టు ఏపీ ప్రభుత్వం చేతిలోకి వెళుతుందని ఆవేదన వ్యక్తం చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో మాట్లాడిన పవన్ నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను రెచ్చగొట్టి ఇప్పుడేమో నీళ్లు నములుతున్నారని ఆరోపించారు.
నిర్మాతలు బహిరంగంగా ఏపీ ప్రభుత్వంపై మాట్లాకుండా భయపడి నాలుగు గోడల మధ్య నాతో బాధను పంచుకుంటే తాను నిలదీశానని.. ఇప్పుడేమో ఏపీ ప్రభుత్వం దగ్గరకెళ్లి కాళ్ల వేళ్ల పడుతున్నారని.. భయపడిపోతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
నా సినిమా పోయినా.. ఉచితంగా చూపించినా తనకు ఏం నష్టం కాదని.. నిర్మాతలు అలా చేస్తారా? ప్రభుత్వానికి భయపడి మిన్నకుంటారా? అని పవన్ నిలదీశారు. నాతో నాలుగు గోడల మధ్యన చెప్పింది.. బహిరంగంగా ఎందుకు చెప్పడం లేదని పవన్ నిలదీశారు.
ఆడకూతుళ్లు సైతం బహిరంగంగా నోరు విప్పుతున్న ఈరోజుల్లో సినీ ఇండస్ట్రీ సమస్యలపై నిర్మాతలు ఎందుకు నోరెత్తడం లేదని పవన్ ప్రశ్నించారు. నాలుగు గోడల మధ్య కాదు.. బహిరంగంగా మాట్లాడాలని పవన్ సూచించారు.
నిర్మాతలు తన వెనుకాల ఒకలా.. ముందు మరోలా వ్యాఖ్యానిస్తున్నారని.. ఏపీ ప్రభుత్వానికి భయపడుతున్నారని పవన్ వారి తీరును కడిగేశారు. పవన్ నిర్మాతలపై మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.