
Pattabhi Ram- Gannavaram: గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి విషయంలో అసలు వ్యూహం వేరే ఉందా? పట్టాభిని టార్గెట్ చేయడం అందులో వ్యూహమేనా? సొంత పార్టీలో ప్రత్యర్థులతో పాటు పట్టాభి తోడైతే తన ఉనికికే ప్రమాదమని ఎమ్మెల్యే వంశీ భయపడ్డారా? సంస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీకి బలమైన నాయకత్వం అందిస్తే ఆ పార్టీ ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశముందా? అందుకే పట్టాభిపై పోలీసులు ప్రతాపం చూపించారా? గన్నవరం వైపు చూడకుండా అతడిలో భయాన్ని నింపే ప్రయత్నం చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏరికోరి పట్టాభినే టార్గెట్ చేయడంపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.
గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన వల్లభనేని వంశీమోహన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతటి జగన్ ప్రభంజనంలో కూడా బతికి బట్టకట్టారు. అయితే అది పార్టీ విజయం కాదని.. తన వ్యక్తిగత సామర్థ్యం అంటూ భావిస్తూ వచ్చారు. అందుకే గెలిచిన రెండేళ్లకే పార్టీకి దూరమయ్యారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే గన్నవరం టీడీపీకి సంస్థాగత బలం. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం ఎక్కువ. అయితే వంశీ పార్టీ ఫిరాయించిన తరువాత అక్కడ బచ్చుల అర్జునుడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కానీ గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ అక్కడ నాయకత్వం కోసం అన్వేషిస్తోంది. పార్టీ వాయిస్ గట్టిగా వినిపిస్తున్న పట్టాభి పేరును పరిశీలనలో తీసుకుంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ యాక్టివ్ నాయకులు సైతం తెరమరుగయ్యారు. పార్టీ కార్యక్రమాల కంటే సొంత పనులకే పరిమితమయ్యారు. ఇటువంటి సమయంలో పట్టాభి వంటి నేతలు పార్టీ వాయిస్ ను గట్టిగానే వినిపించారు. అటు సీఎం నుంచి మంత్రులు దాకా ఎవర్నీ విడిచిపెట్టలేదు. నేరుగా టార్గెట్ చేస్తూ వచ్చారు. గతంలో రెండు సార్లు ఆయనపై అధికార పక్షం అటాక్ చేసింది. అప్పటి నుంచే టీడీపీలో పట్టాభి వాయిస్ పెరిగింది. ఓ సామాన్య నాయకుడిగా ఉన్న పట్టాభి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన వచ్చేదాక ఆయన ఫేమ్ పెరిగింది. ఇటువంటి తరుణంలో గన్నవరంలో నాయకత్వం కోసం పార్టీ అన్వేషిస్తోంది. అక్కడ పట్టాభి అయితే కరెక్ట్ అన్న స్థిర నిర్ణయానికి హై కమాండ్ వచ్చింది.

అయితే ఈ విషయం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెవిట్లో పడింది. అదే కానీ జరిగితే టీడీపీ సంస్థాగత బలానికి.. బలమైన నాయకత్వం తోడైతే తన పని కష్టమని డిసైడ్ అయ్యారు. అందుకే పట్టాభిని భయపెట్టడానికి డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే 20 గంటల పాటు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఎంతలా భయపెట్టాలో అంతలా చేశారు. అయితే తెలియకుండానే పట్టాభిని స్టేట్ లీడర్ చేశారు. తాజా పరిణామాలు, పోలీసు కేసులు తట్టుకొని నిలబడితే మాత్రం పట్టాభి గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయంగా తేలుతోంది.
