ఏపీ సీఎం జగన్ రివ్యూ మొదలుపెట్టబోతున్నారు. తను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పనిచేస్తున్నాయా? ప్రజలకు అందుతున్నాయా? వారు సంతృప్తికరంగా ఉన్నారా? ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్, నేతలను నమ్ముకునే కంటే ప్రజలను నేరుగా వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రతిదీ వ్యక్తిగతంగా స్వయంగా తెలుసుకోవాలని సీఎం జగన్ రెడీ కావడంతో ఆయా ఎమ్మెల్యేలు, మంత్రుల్లో వణుకు మొదలైందని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
గ్రామస్థాయి వరకు సీఎం జగన్ వెళ్లలేరు. ఎమ్మెల్యేలు, డివిజన్ నేతలు చెప్పింది విని తెలుసుకుంటారు. దీంతో సీఎం-ప్రజల మధ్య దూరం పెరిగిపోతోంది. నేతలు వీరి బంధాన్ని బ్లాక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేరుగా తనే రంగంలోకి దిగాలని జగన్ రెడీ అయ్యారు.
ఇటీవల విడుదలైన జీవోలు అమలు అవుతున్నాయని మంత్రులు అనుకుంటున్నాయి. కానీ వాటీలో చాలా ఎమ్మెల్యే స్థాయిలో ఆగిపోతున్నాయని జగన్ దృష్టికి వచ్చిందట.. కొంత మంది అధికారులు సీఎంకు తప్పుడు నివేదికలు ఇస్తున్నట్టు తెలిసిందట.. తిమ్మిని బమ్మిని చేసి అంతా బాగుందని రంగుల ప్రపంచం చూపి సీఎం జగన్ కు చెబుతున్నారని.. వీటిని నమ్మవద్దని జగన్ డిసైడ్ అయ్యారు.
వీటన్నింటికి చెక్ పెట్టాలంటే.. వాస్తవాలు తెలుసుకోవాలంటే.. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగతంగా ప్రజలను క్షేత్రస్తాయిలో కలవాలని నిర్ణయించుకున్నారట.. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలని.. తప్పు చేసిన అధికారులను శిక్షించాలని జగన్ డిసైడ్ అయ్యారట.. ఇక అభివృద్ధి పనులకు అక్కడికక్కడే నిధులను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.
కరోనా వేవ్ కూడా దిగివచ్చినందున తన పాలనపై స్వీయ సమీక్ష చేసుకునేందుకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దూకుడుగా రాష్ట్రమంతటా పర్యటించి ప్రజలు అసలు తన పాలనపై ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని జగన్ నిర్ణయించినట్టు తెలిసింది.