హిందువులు.. హిందూ దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలంటూ పరిపూర్ణానంద స్వామిజీ హెచ్చరించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ హిందువు అని.. క్రైస్తవుడు అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు.ఇక ఏపీ మంత్రి కొడాలి నానిపై కూడా మండిపడ్డారు స్వామి పరిపూర్ణానంద.. మంత్రి నాని చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో వివాదం రగిలించేలా మంత్రి నాని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పరిపూర్ణనంద అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇటీవల ఏపీలోని దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. మసీదులు, చర్చిలకు ఉన్న ప్రతిపత్తి హిందూ దేవాలయాలకు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాలకు సిగ్గు.. లజ్జ ఉంటే వెంటనే దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలంటూ స్వామిజీ డిమాండ్ చేశారు.
దేవాలయాలపై మాట్లాడే అర్హత మంత్రి నాని ఉందా? అంటూ ప్రశ్నించారు. ఆయనలా తాను బజారు మాటలు మాట్లాడలేనని.. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి నాని సైతం తిరుమలకు వచ్చినపుడు డిక్లేషన్ ఇవ్వాలన్నారు. జగన్ హిందువుల మనోభావాలను గౌరవించకుంటే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని స్వామిజీ హెచ్చరించారు.