
ఏపీలో పంచాయతీ పోరులో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయనే కనిపిస్తోంది. వైసీపీ చేస్తున్న వ్యూహాల ప్రతిఫలాలు వస్తున్నాయి. వైఎస్సార్సీపీయేతర రాజకీయ పార్టీలన్నీ ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో దాని ప్రభావం పెద్దగా పడట్లేదు. రెండో విడతలోనూ అదే జోరు నెలకొంది. మరోసారి 500 మార్క్‌ను దాటాయి. తొలివిడతలోనూ 525 ఏకగ్రీవ పంచాయతీలు కాగా.. రెండో విడతలో దానికి సమానంగా ఏకగ్రీవాలు నమోదయ్యాయి.
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో ఎక్కడెక్కడ ఏకగ్రీవాలు నమోదు అయ్యాయనేది తేలింది. రెండ విడతలో 522 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఏకగ్రీవం అయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో 70 చొప్పున పంచాయతీల్లో రెండో విడత ఎన్నికలు ఉండవు. పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో అత్యల్పంగా అనంతపురం జిల్లాల్లో ఏకగ్రీవాలు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో 15 చొప్పున పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకున్నారు.
విజయనగరం జిల్లాలో రెండో అత్యధిక ఏకగ్రీవ పంచాయతీలు నమోదయ్యాయి. ఇక్కడ 60 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. తొలి విడతలో ఈ జిల్లాల్లో ఎన్నికలను నిర్వహించట్లేదు. తొలి రెండు విడతల్లో నమోదైన ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య 1,047కు చేరింది. తొలి దశలో 525, మలి దశలో 522 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వాటన్నింటికీ జనభా ప్రాతిపదికన ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను అందించనుంది. రెండో విడతలో నమోదైన మొత్త ఏకగ్రీవాల్లో గుంటూరు, ప్రకాశం, విజయనగరం, కర్నూలు, చిత్తూరు జిల్లాలు టాప్-5లో నిలిచాయి.
గుంటూరులో -70, ప్రకాశంలో-70, విజయనగరంలో -60, కర్నూలులో -57, చిత్తూరులో -53 పంచాయతీల్లో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి పోటీలు ఒక్కరే బరిలో ఉండటంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గుర్తించారు. దీన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాజధాని అమరావతి ప్రాంతం పరిధిలోని గుంటూరు జిల్లాలో రెండో విడతలోనూ భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలి విడతలోనూ ఇక్కడ 67 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తంగా చూస్తే జగన్ అనుకుంటున్నట్లుగా తన ఏకగ్రీవ లక్ష్యాలను చేరుకోబోతున్నట్లే స్పష్టం అవుతోంది.