Revanth Reddy- Munugode By Election: మునుగోడులో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం నిర్వహిస్తున్నాయి. మునుగోడులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మూడు పార్టీలు తమ ప్రతిష్టగా భావించి ముందుకు పోతున్నాయి. పోయిన పరువు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇక మునుగోడుతో ఆత్మవిశ్వాసం రెండింతలు చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని మరోమారు నిలుపుకుంటామని ప్రతిన బూనింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ కు వివిధ మండలాల నుంచి కార్యకర్తలను తరలించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

రాష్ట్రంలో బూర్జువా పార్టీల దుమ్ముదులుపాలని కోరారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. దీంతో పార్టీని గెలిపించి అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్ నేతల్లో గుబులు కలిగేలా చేయాలి. పేదల పక్షాన నిలిచే కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని రెండు పార్టీలు కుయుక్తులు పన్నుతున్నాయి. కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో రాష్ట్రం, దేశం నలిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అందరికి సమన్యాయం జరుగుతుంది. దీనికి గాను అందరు సహకరించాలి. పార్టీ అభ్యర్థి స్రవంతిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
దొంగలు దొరలుగా మారుతున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. పాలనను భ్రష్టు పట్టిస్తున్నారు. అభివృద్ధి అనేది లేకుండా పోతోంది. పర్సంటేజీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఏ ఊరు చూసిన అభివృద్ధి పనులు మాత్రం కనిపించడం లేదు. అంతా పర్సంటేజీల కోసమే పనిచేస్తున్నారు. ఏ ప్రాజెక్టు కడితే ఎంత లాభం వస్తుందనే ఉద్దేశంతోనే రూ. లక్షల కోట్లు కుమ్మరించారు. ఇంతవరకు ప్రతిఫలం మాత్రం దక్కలేదు. అదిగో కాళేశ్వరం నీళ్లు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు.

మునుగోడులో సమరానికి కాంగ్రెస్ సై అంటోంది. అందరి సహకారంతో విజయం సాధిస్తామని చెబుతోంది. ఇందులో భాగంగానే పాల్వాయి స్రవంతి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముందుండి నడిపించారు. కార్యకర్త్లల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. మునుగోడులో ఇంతవరకు ఒక్క ఆడబిడ్డ కూడా విజయం సాధించలేదు. అందుకే స్రవంతిని గెలిపించి మీ ఆడబిడ్డగా దీవించాలని కోరారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే మరి.