Palasa : సర్దార్ గౌతు లచ్చన్న ఈ పేరుకు తెలుగునాట ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. బలహీనవర్గాల నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా పవర్ ఫుల్ రోల్ ప్లే చేశారు. అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించారు. సీఎంతో సమానంగా గౌరవ మర్యాదలు దక్కించుకున్న తొలితరం నాయకుడు ఆయన. శ్రీకాకుళం జిల్లాలో కాకలు తీరిన రాజకీయ నాయకులకు సైతం ముచ్చెమటలు పట్టించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు నెరిపారు. సోంపేట, పలాస నియోజకవర్గాలను బలమైన పునాదులుగా ఏర్పాటుచేసుకున్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాత రాజకీయ వారసుడిగా గౌతు లచ్చన్న కుమారుడు శివాజీ సోంపేట నియోజకవర్గం నుంచి అరంగేట్రం చేశారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో తొలిసారిగా పలాస నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. 2014లో మాత్రం విజయం సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో తన వారసురాలిగా కుమార్తె శిరీషకు టిక్కెట్ ఇప్పించుకున్నారు. కానీ గెలిపించుకోలేకపోయారు. ఆమెపై డాక్టర్ సీదిరి అప్పలరాజు గెలుపొందారు. ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు.
అనూహ్యంగా రాజకీయాల్లోకి…
గత ఎన్నికల్లో డాక్టర్ సీదిరి అప్పలరాజుకు సానుభూతి వర్కవుట్ అయ్యింది. సుదీర్ఘ కాలం నియోజకవర్గాన్ని పాలించిన గౌతు కుటుంబానికి వ్యతిరేకంగా దీటైన అభ్యర్థి కోసం వైసీపీ ఎదురుచూస్తున్న రోజులవి. మత్స్యకార వర్గానికి చెందిన అప్పలరాజు తారసపడడంతో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా పార్టీలోకి ఎంటరైన వెంటనే అప్పలరాజుకు ఇన్ చార్జి పోస్టు ఇచ్చారు. అక్కడకు కొద్దిరోజులకే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. సామాజిక లెక్కలతో రెండేళ్ల కిందట మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే గత ఎన్నికల్లో అప్పలరాజు విజయానికి సహకరించిన చాలా వర్గాలు ఇప్పుడు ఆయనకు దూరమయ్యాయి. ముఖ్యంగా కాళింగ సామాజికవర్గం ఆయన్ను బాహటంగానే వ్యతిరేకిస్తోంది.
గౌతు కుటుంబంపై దుష్ప్రచారం..
గౌతు కుటుంబంపై నియోజకవర్గంలో వ్యతిరేక ముద్ర వేయడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. ఒకటి రెండు ఘటనల్లో అప్పటి ప్రశాంత్ కిశోర్ టీమ్ సైతం ఎంటరై జఠిలం చేసిన సందర్భాలున్నాయి. అప్పటికే శివాజీ అల్లుడు, శిరీష భర్తపై పలురకాల అభియోగాలు మోపుతూ ప్రజా వ్యతిరేకత పెంచడంలో వైసీపీ శ్రేణులు విజయవంతమయ్యాయి. చాలామంది టీడీపీ నేతలు గౌతు కుటుంబ నాయకత్వాన్ని వ్యతిరేకించి వైసీపీ గూటికి చేరారు. పలాసలో ఉండే వ్యాపారవర్గాలకు లేనిపోని భ్రమలు, భయాలు చూపించడంతో వారు కూడా వైసీపీకి సపోర్టు చేశారు. అయితే ఇలా విజయం దక్కించుకున్న అప్పలరాజు ఎన్నికల అనంతరం తన స్వరాన్ని మార్చుకున్నారు. తన వెంట నడిచిన వర్గాలను దూరం చేసుకున్నారు.
వృద్ధ నేత ఎంటర్..
2024 ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రిగా బరిలో దిగే అప్పలరాజుకు ఏమంత ఈజీ కాదు. అక్కడ మాజీ మంత్రి గౌతు శివాజీ పట్టుబిగుస్తుండడమే అందుకు కారణం. వైసీపీలో ఉన్న విభేదాలను శివాజీ క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. గతంలో తనతో పనిచేసి గత ఎన్నికల్లో పార్టీకి దూరమైన నాయకులను దగ్గరయ్యే పనిలో పడ్డారన్న టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు నియోజకవర్గంలో ఏ పనీ జరగలేదన్న టాక్ ఉంది. ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణం, వంశధార కాలువ ఆధునికీకరణ, వంటి కీలక ప్రాజెక్టులకు మోక్షం కలగలేదు. గత ఎన్నికల్లో పలాస నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని అప్పలరాజు హామీ ఇచ్చారు. గత నాలుగేళ్లుగా వీటికి మోక్షం కలగకపోగా.. మరో ఏడాదిలో ఎన్నికలకు వెళుతున్న వేళ ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని క్యాష్ చేసే పనిలో టీడీపీ ఉండడంతో ప‘లాస్’ తప్పదని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.