Pakistan : పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించి, జవాన్ల ఉత్సాహాన్ని పెంచేలా ప్రసంగించినట్లు సమాచారం. రావల్పిండి, లాహోర్, కరాచీ వంటి కీలక నగరాల్లోని సైనిక స్థావరాల్లో భద్రతను పటిష్ఠం చేశారు. సైనికుల సెలవులను రద్దు చేసి, అన్ని యూనిట్లను సంసిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం, పాక్ వైమానిక దళం విమానాలు కరాచీ నుంచి ఉత్తర సరిహద్దు స్థావరాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విమాన తరలింపుపై భారత్, పాకిస్థాన్ అధికారులు అధికారికంగా స్పందించలేదు.
Also Read : పాకిస్తాన్ నిర్ణయం.. భారత్‌కు రూ.5 వేలు కోట్ల నష్టం..
ఢిల్లీలో హైఅలర్ట్
ఇటు భారత్‌లోనూ భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి, రాజధానిలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులను గుర్తించిన పోలీసులు వారిని తమ దేశానికి తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేశారు. అటారీ–వాఘా సరిహద్దు ద్వారా ఇప్పటికే 786 మంది పాక్ పౌరులు స్వదేశానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత నౌకాదళం కూడా క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించి, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపింది.
పాక్‌పై ఒత్తిడి
పహల్గాం దాడిని అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు ఖండించాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయాలని భారత్ విదేశాంగ శాఖ జీ20 రాయబారులతో చర్చించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆర్థిక సంక్షోభం, బలూచిస్థాన్‌లో తిరుగుబాటు దాడులు ఆ దేశాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టాయి. క్వెట్టాలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడిలో 10 మంది పాక్ సైనికులు మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి.
భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నప్పటికీ, శాంతియుత పరిష్కారమే ఉభయ దేశాలకు శ్రేయస్కరం. అయితే, ఉగ్రవాదంపై భారత్ దఢ వైఖరిని కొనసాగిస్తూ, దేశ భద్రత కోసం అన్ని రంగాల్లో సన్నద్ధంగా ఉంది. ప్రస్తుత పరిస్థితులు రెండు దేశాల మధ్య సంయమనాన్ని, అంతర్జాతీయ సమాజం నుంచి సమన్వయ చర్యలను కోరుతున్నాయి.