Modi- Mulayam Singh Yadav: రాజకీయల్లో వ్యూహరచన ఎంతో ముఖ్యం. నేతలు చేసే ఆ వ్యూహాలే పార్టీ బలాన్ని పెంచుతాయి. ఎన్నికల్లో విజయాన్ని చూకూర్చుతాయి. ఇటీవల కాలంలో వ్యూహాల కోసం పార్టీలు స్ట్రాటజిస్టులను నియమించుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో మోదీ–షా ద్వయం చేసే వ్యూహాలు 90 శాతం విజయవంతం అవుతున్నాయి. తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న వ్యూహాలు మోదీ–షా వ్యూహాల ముందు తేలిపోతున్నాయి. ఇక తెలంగాణలో కేసీఆర్ వ్యూహాలు కూడా సక్సెస్ అవుతున్నాయి. తొమ్మిదేళ్లుగా తెలంగాణలో ఆయన ఎదురులేని శక్తిగా పాలన సాగిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న సమయంలో మోదీ–షా ద్వయం చేసిన ‘పద్మ’ వ్యూహం అందరినీ డిఫెన్స్‌లో పడేసింది. యూపీలో ప్రతిపక్ష పార్టీని ఏకాకిని చేసింది.

– ములాయంకు అత్యున్నత పురస్కారం..
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్‌కు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించడం ప్రధాని మోదీ ప్రభుత్వ మాస్టర్ స్ట్రోక్‌గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. యాదవుల్లో ఉన్నతస్థాయి నేతగా గుర్తింపు చెందిన ములాయంకు మద్దతిచ్చిన యాదవవర్గాలు, బీసీలు ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు పూర్తిగా మద్దతివ్వడం లేదు. దీనిని పసిగట్టిన మోదీ, వారిని తమ వైపు తిప్పుకునేందుకే ఈ వ్యూహం పన్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్‌ను ఏకాకి చేసేందుకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. దీని వల్ల సార్వత్రిక ఎన్నికల్లో ములాయం అభిమానుల్లో అనేకమంది మోదీవైపు మొగ్గు చూపుతారని ఈ వర్గాలు చెబుతున్నాయి.
– యూపీలో యాదవులే కీలకం..
ఉత్తర ప్రదేశ్‌లో యాదవ సామాజికవర్గం అత్యంత ప్రభావవంతమైంది. ఎన్నికల్లో గెలుపోటములను వీరు ప్రభావితం చేస్తారు. నిజానికి మోదీని ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బీసీ నేతగా బీజేపీ గత ఎనిమిదేళ్లుగా చిత్రీకరించడం మూలంగా పలు యాదవేతర బీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. తాజా అవార్డుతో ఇప్పుడు యాదవులు కూడా పునరాలోచన చేస్తారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
– శత్రువునూ మిత్రుడిగా మార్చే ప్లాన్..
ములాయంకు పద్మ అవార్డు ప్రకటించడంపై సంఘ్ పరివార్, బీజేపీలోని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇది బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకు కారణం కూడా ఉంది. రామజన్మభూమి ఉద్యమం జరిగినప్పుడు 1990లో యూపీలో ములాయన్‌సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే ఏడాది నవంబరు 2న వేలాది మంది కరసేవకులపై కాల్పులు జరిపించి, అనేకమంది మరణానికి ములాయం కారణమయ్యాడు. కరసేవకుల విరోధి అయిన ములాయంకు ప్రధాని మోదీ పద్మవిభూషణ్ ప్రదానం చేయడంపై సంఘ్ పరివార్‌లో అనేకమంది పెదవి విరుస్తున్నారు. అయితే మోదీ నిర్ణయంలోని రాజకీయ వ్యూహాన్ని వారు అర్థం చేసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

– డిఫెన్స్‌లో అఖిలేశ్ వర్గం..
మోదీ మాస్టర్ స్రోక్‌తో ములాయంసింగ్ యాదవ్‌కు పద్మవిభూషణ్ ఇవ్వడం సమాజ్‌వాదీ పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన కుమారుడు, యూపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్ మద్దతుదారులు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. ములాయంవంటి ఉన్నతస్థాయి నేతకు భారతరత్న ప్రదానం చేయాల్సి ఉన్నదని, పద్మవిభూషణ్ ఆయన స్థాయికి తక్కువేనని అఖిలేశ్ సతీమణి డింపుల్‌యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామిప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. ఊహించని విధంగా తమనేతకు వచ్చిన గౌరవంతో సంతృప్తిగా ఉన్నప్పటికీ తమ నేతస్థాయిని మరింత పెంచే ప్రయత్నమే వారి మాటల్లో అంతరార్థంగా కనిపిస్తోంది. తాజాగా మోదీ చేసిన ‘పద్మ’వ్యూహంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పనిచేసే అంశంపైనా పునరాలోచన చేయాల్సిన పరిస్థితి. అట్లుంటది మరి మోదీ వ్యూహం!