P. Vijaya Babu: ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా మాజీ ఆర్టీఐ కమిషనర్ ,సీనియర్ జర్నలిస్టు పి.విజయ్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల జగన్ సర్కారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎట్టకేలకు రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం ఆయన స్థానంలో విజయ్ బాబును నియమించింది. సీనియర్ పాత్రికేయుడిగా విజయ్ బాబుకు తెలుగు భాషపై పట్టుంది. అందుకే ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ఎంపిక చేసింది. అయితే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేసి చాలా రోజులవుతున్న నేపథ్యంలో తీవ్ర తర్జనభర్జనల నడుమ ఆయన స్థానంలో విజయ్ బాబును ఎంపిక చేసినట్టు తెలిసింది.

సీనియర్ జర్నలిస్టుగా విజయ్ బాబు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులు. పలు పత్రికల్లో ఆయన పనిచేశారు. ఆంధ్రప్రభ ఎడిటర్ గా కూడా వ్యవహరించారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ గా కూడా పదవిని నిర్వర్తించారు. యార్లగడ్డ రాజీనామా తరువాత చాలామంది ఆశావహులు పదవి కోసం పోటీపడ్డారు. కానీ జగన్ సర్కారు క్లీన్ నీట్ ఇమేజ్ ఉన్న ప్రముఖ పాత్రికేయుడైన విజయ్ బాబు వైపే మొగ్గుచూపింది.

ఈ పరిణామాలపై యార్లగడ్డ ఎలా రియాక్టవుతారో చూడాలి. ఎన్టీఆర్ పేరు మార్పు సమయంలో, తాను రాజీనామా చేసినప్పుడు యార్లగడ్డ క్లియర్ గా ప్రకటించారు. గతంలో తాను తెలిసి తెలియకో రాజకీయాలు చేశానని.. ఇక నుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పారు. అయినా జగన్ మంచిని కోరుకుంటానని.. ఆయన ఫాలోవర్ గా ఉంటానని కూడా అన్నారు. దీంతో యార్లగడ్డ తిరిగి పదవిలో కొనసాగుతారని అంతా భావించారు. కానీ జగన్ మాత్రం కొనసాగింపునకు ఇష్టపడలేదని తెలిసింది. స్వయంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి పేరు మార్పును ఆహ్వానిస్తే.. యార్లగడ్ల వ్యతిరేకించడం ఏమిటని జగన్ కాస్తా అసహనం వ్యక్తం చేశారట. ఆయన అంత ఫాస్ట్ గా రియాక్ట్ కావడం రుచించలేదట. అందుకే మారు మాట లేకుండా రాజీనామాను ఆమోదించి.. ఆయన స్థానంలో విజయ్ బాబును కూర్చోబెట్టారు. యార్లగడ్ల అలిగితే అలిగారు కానీ సీనియర్ జర్నలిస్టుకు లైన్ క్లియర్ చేశారని చెప్పొచ్చు. ఈ పదవిలో విజయ్ బాబు ఎంపిక సరైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.