వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు, రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు వివాదస్పదం అవుతున్నాయి. అయితే.. రైతుల పట్ల ప్రభుత్వాలు.. అధికార పార్టీలు వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఆందోళనలు విరమించి వెనక్కి పోవాలని ఓ వైపు ప్రభుత్వం ఆదేశిస్తుంటే.. తాము ఎక్కడికి వెళ్లేది లేదంటూ రైతులు భీష్మిస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read: రెండు కన్నీటిబొట్లు రైతు ఉద్యమాన్ని మలుపుతిప్పాయి
జనవరి 26న ఎర్రకోట కేంద్రంగా జరిగిన అరాచకాన్ని రైతులపైకి నెట్టేసి విపరీతమైన ప్రచారం చేసి.. ప్రజల్లో వారి ఉద్యమంపై సానుభూతిని తగ్గించే ప్రయత్నం చేశారు కొందరు. ఆ తర్వాత కొంత మంది ‘స్థానికుల’ పేరుతో రచ్చ ప్రారంభించారు. ఢిల్లీలో శివారు స్థానికులమంటూ రైతుల శిబిరాలపై దాడులు చేయడం ప్రారంభించారు. కొంత మంది ధర్నాలు చేస్తున్నారు. రైతులు అక్కడ్నుంచి ఖాళీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ స్థానికులు ఎవరన్నదానిపైనే ఇప్పుడు వివాదం ప్రారంభమైంది. వారంతా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలని ఆరోపణలు వినిపించడం ప్రారంభమయ్యాయి.
Also Read: ఒక్కటైనా దక్కేనా..? ఆశలు పెట్టుకున్న కమలం
అయితే.. వారిని స్థానికులు అంటూ మీడియా కూడా ఏకపక్షంగా చెబుతోంది. రైతులు స్థానికుల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. అలాంటప్పుడు స్థానికులు రైతులకు వ్యతిరేకంగా ఎందుకు నిరసనలు చేస్తారన్నది డాలర్ల ప్రశ్న. అదే సమయంలో రైతులకు మౌలిక సదుపాయాలు అందకుండా చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం శక్తివంచన లేకుండా చేస్తోంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రైతులకు అదనంగా మరికొంత మంది వచ్చిచేరుతున్నారు కానీ.. తగ్గడం లేదు. పైగా ఇది ఉత్తరాదిలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్‌గా ఉన్న వర్గాన్ని అసహనానికి గురి చేస్తుండటంతో వారిని దూరం చేసుకోలేక బీజేపీ.. బలవంతంగా ఖాళీ చేయించే ఉద్దేశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లుగా చెబుతున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
అయితే.. ఇలాంటి పరిస్థితే ఏపీలోని అమరావతి రైతులకు వచ్చింది. 400 రోజులకుపైగాఉద్యమం చేస్తున్న రైతులపైకి ఇటీవల మూడు రాజధానుల మద్దతుదారుల పేరుతో కొంతమందిని రంగప్రవేశం చేయించారు. ఇతర ప్రాంతాల నుంచి రోజువారీగా తీసుకొస్తున్న వారు అక్కడ పోటీగా ధర్నాలు చేస్తున్నారు. వారికి పోలీసులు మద్దతిస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం అధికార పార్టీనే ఆ ఉద్యమాన్ని స్పాన్సర్ చేసిందనే ఆరోపణలు సహజంగానే వచ్చాయి. అమరావతిలో మూడు రాజధానుల ఉద్యమకారుల పేరుతో.. ఢిల్లీలో స్థానికుల పేరుతో రైతులపైనే రివర్స్ వ్యూహం అమలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే అక్కడా.. ఇక్కడా రైతుల ఉద్యమాన్ని అణిచేందుకే ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు బలయ్యేది కూడా రైతే అన్నట్లుగా అర్థమవుతోంది.