ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో రాజకీయ కాక రాజుకుంటోంది. ఇందులో భాగంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులపై పార్టీలు దృష్టి సారించాయి. ఏ అధికారి విధుల్లో ఉంటే ఎలాంటి నష్టాలు ఉంటాయి, అధికార పార్టీతో అంటకాగే అధికారులెవరన్న వివరాలు బయటపెడుతున్నాయి. వారిపై ఇటీవల పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాయి. కొంతమంది ఐఏఎస్ అధికారుల పేరు చెబితేనే భగ్గుమంటున్నాయి. అలాంటి అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చూడాలని, ప్రస్తుతమున్న స్థానాల నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదివరకటి ఎన్నికల్లో ఈ అధికారులు అధికార బీఆర్‌ఎస్ పార్టీకి సహకరించారని, పైగా పలు రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని వివరిస్తున్నాయి. ప్రజాస్వామిక దేశంలో పక్షపాతానికి తావు లేదని, ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని కోరుతున్నాయి. ఈ వరుసలో కాంగ్రెస్, బీజేపీ ముందున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, అర్వింద్‌కుమార్, జయేశ్ రంజన్, రజత్‌కుమార్, నవీన్ మిత్తల్, స్మితా సబర్వాల్, ఈవీ నర్సింహారెడ్డితో పాటు నాన్-క్యాడర్ అధికారులైన ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ బోయినపల్లి మనోహర్‌రావును ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేయాలని, ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చూడాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
మియాపూర్ భూకుంభకోణంలో సీఎస్ శాంతికుమారి పాత్ర ఉందని, ఆమె ఆరోగ్యశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు గడల శ్రీనివాసరావుపై వచ్చిన నేషనల్ హెల్త్ మిషన్ నిధుల దుర్వినియోగ ఆరోపణలను డ్రాప్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. డీజీపీ అంజనీకుమార్ కూడా ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అని, వీరితో పాటు రాష్ట్రంలోని ఇతర ఐపీఎస్ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి ‘యాక్టింగ్ ఏజెంట్లు’గా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
కాంగ్రెస్ ఆరోపిస్తున్న అధికారులు వీరే..
అర్వింద్‌కుమార్
ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్. ఈయన బీఆర్‌ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఓఆర్‌ఆర్ టోల్ కాంట్రాక్టును ఐఆర్‌బీ సంస్థకు అప్పగించారు. కేటీఆర్ బినామీలకు భూములు అమ్మారన్న ఆరోపణలు ఉన్నాయి.
జయేశ్ రంజన్
మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఏడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఇన్‌చార్జి ఎండీగా వ్యవహరిస్తూ ‘ధరణి’ పోర్టల్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టును దివాలా తీసిన టెర్రాసిస్ కంపెనీకి అప్పగించారు. పంజాబ్ బ్యాంకు నుంచి రూ.159 కోట్ల రుణం తీసుకున్న శర్మకు చెందిన సందేహాస్పద కంపెనీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘నిథిమ్’ భూములను కట్టబెట్టారు. ఇప్పటికే రూ.159 కోట్ల కేసును సీబీఐ విచారిస్తోంది. ఇలాంటి కంపెనీల నుంచి అధికార బీఆర్‌ఎస్ పార్టీకి విరాళాలు ఇప్పించడంలో జయేశ్ రంజన్ ప్రభావం ఉంది.
రజత్‌కుమార్
సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఈయన 2018 ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నారు. అప్పట్లో రాష్ట్రంలోని 25 లక్షల ఓట్లు గల్లంతవడంలో కీలకపాత్ర పోషించి, బీఆర్‌ఎస్ ను తిరిగి అధికారంలోకి తేవడానికి దోహదపడ్డారు అనే ఆరోపణలున్నాయి
నవీన్ మిత్తల్
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఈయనపై పలు కోర్టు ధిక్కార కేసులు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
స్మితా సబర్వాల్
ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి అయిన ఈమె మిషన్ భగీరథ ప్రాజెక్టు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. తన ప్రైవేటు కేసు విచారణ కోసం రూ.15 లక్షల ప్రభుత్వ సొమ్ము వాడుకున్నారు. ఈ సొమ్మును రికవరీ చేయాలని హైకోర్టు ఆదేశించినా ఫలితం లేదు. రూ.40 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ అనేది ఆర్థిక కుంభకోణం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈవీ నర్సింహారెడ్డి: టీఎస్ ఐఐసీ వీసీఎండీగా పదేళ్లుగా ఉన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తున్నారు.