https://oktelugu.com/

భూముల అమ్మకంపై విపక్షాల ఫైర్‌‌ : విశాఖ ఫ్యాక్టరీని కాపాడుకునేదెలా..?

‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో ఎంతో పోరాడి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నారు ఆంధ్రులు. ఎన్నో ఏళ్ల పాటు ఈ ఉద్యమ పోరు నడిచింది. ఎన్నో పోరాటాల మధ్య సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పుడు ప్రైవేటు కబంధ హస్తాల్లోకి వెళ్లబోతోంది. దీంతో ఆ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం, విపక్షాలతో పాటు కార్మిక సంఘాలు సైతం ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాయి. అయితే.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా కాపాడడానికి సీఎం జగన్ తాజాగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 19, 2021 / 01:25 PM IST
    Follow us on


    ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో ఎంతో పోరాడి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నారు ఆంధ్రులు. ఎన్నో ఏళ్ల పాటు ఈ ఉద్యమ పోరు నడిచింది. ఎన్నో పోరాటాల మధ్య సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పుడు ప్రైవేటు కబంధ హస్తాల్లోకి వెళ్లబోతోంది. దీంతో ఆ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం, విపక్షాలతో పాటు కార్మిక సంఘాలు సైతం ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాయి. అయితే.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా కాపాడడానికి సీఎం జగన్ తాజాగా ప్రధానికి రాసిన లేఖతో పాటు కార్మిక సంఘాల భేటీలోనూ ఓ ప్రతిపాదన చేశారు.

    Also Read: బీజేపీకి పరీక్షలా ఎమ్మెల్సీ ఎన్నికలు

    స్లీల్‌ ప్లాంట్‌ భూముల్లో 7 వేల ఎకరాలు అమ్మడం ద్వారా కర్మాగారాన్ని కాపాడుకోవచ్చని ప్రతిపాదించారు. అయితే.. విపక్షాలతో పాటు కార్మిక సంఘాలు, స్థానికులు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను అడ్డుకోవాలంటే ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితుల్లో వైసీపీ సర్కారు చేసిన ఓ ప్రతిపాదన రాష్ట్రంలో దుమారం రేపుతోంది. స్టీల్‌ ప్లాంట్‌కు ఉన్న భూముల్లో 7 వేల ఎకరాలను అమ్మడం ద్వారా దీన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవచ్చని సీఎం జగన్‌ ప్రధానికి రాసిన లేఖలో ప్రతిపాదించారు.

    అలాగే.. తాజాగా స్టీల్‌ ప్లాంట్ కార్మిక సంఘాలతో జరిగిన భేటీలోనూ ఇదే విషయం చెప్పారు. అయితే దీనికి అంగీకరించాల్సింది మాత్రం కేంద్ర ప్రభుత్వమే. కానీ.. ఆ లోపే ఈ ప్రతిపాదనపై రాష్ట్రంలో విపక్షాలు, కార్మిక సంఘాలు విరుచుకుపడుతున్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం అప్పట్లో కురుపాం జమీందార్ల కుటుంబం 6 వేల ఎకరాల భూమిని ఉచితంగా ప్రభుత్వానికి ఇచ్చింది. ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే పేరుతో భూముల్ని అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడ ఉందన్న ప్రశ్న తలెత్తుతోంది. భూములమ్మి ప్లాంట్‌ కాపాడాలన్న ఆలోచనే సరికాదని మేధావులు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తక్షణం ఈ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

    Also Read: హైకోర్టు లాయర్ల హత్య వెనుక బిట్టు శీను.. నిందితుడు టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ మేనల్లుడు?

    ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వాటి భూములను అమ్ముకుంటూ వెళ్తే చివరికి మిగిలేది ఏమీ ఉండదని అంటున్నారు. అందుకే.. సీఎం ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం దాతలు ఇచ్చిన భూముల్ని అమ్మడం ద్వారా ప్లాంట్‌ను కాపాడాలని ప్రభుత్వం భావించడం సరికాదని విపక్షాలు చెబుతున్నాయి. చేతనైతే ప్రభుత్వం నేరుగా వాటాల కొనుగోలు ద్వారా స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని విపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఒకవేళ ప్లాంట్‌ భూముల అమ్మకానికి ప్రయత్నిస్తే మాత్రం న్యాయపోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్