టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, భవిష్యత్ లో పార్టీ పగ్గాలు తీసుకోవాలని భావిస్తున్న లోకేష్ పై సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేక వ్యక్తమవుతోందా? సీనియర్లుగా ఉన్న కమ్మ నేతలు ఉద్దేశపూర్వకంగానే లోకేష్ ను బయట పెడుతన్నారా? అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న నేతలు.. ఇప్పుడు ఓపెన్ అయిపోతుండడం గమనించాల్సిన అంశం.
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ను తీసుకొచ్చి మంత్రిగా కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అంతా తనదే అన్నట్టుగా వ్యవహరించిన లోకేష్.. ఎవ్వరినీ పట్టించుకోలేదని నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. లోకేష్ తో మాట్లాడాల్సి వస్తే.. కొందరు సీనియర్లు ముందు చేతులు కట్టుకోలేక.. వెనక చేతులు పెట్టుకొని నిలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా.. టీడీపీ మొత్తం తనదే అనేలా నడుచుకున్న లోకేష్ తో.. తమకు ఒరిగింది ఏమీ లేదని భావిస్తున్నారట పలువురు నేతలు.
అయితే.. ఎంత అసంతృప్తి కలిగినా.. పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి అన్నీ మౌనంగానే భరించినట్టుగా తెలుస్తోంది. కానీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓటమిపాలైన తర్వాత నేతలు తమలోని అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. ఆ మధ్య అచ్చెన్నాయుడు, మరికొందరు పార్టీపై, లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కృష్ణా జిల్లా నేతలు కూడా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం.
లోకేష్ ను నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్ గంగలో కలిసిపోవడం ఖాయమని, వేరే పార్టీల్లోకి సైతం వెళ్లిపోతున్నారు. నిజానికి కమ్మ సామాజిక వర్గంలో లోకేష్ పై వ్యతిరేకత ఉందన్న విషయం చంద్రబాబుకు సైతం తెలుసని అంటున్నారు. కానీ.. ఇప్పుడు ఆయన ఏమీ చేయలేని పరిస్థితి. చేతిలో అధికారం లేకపోవడం.. వరుస ఎన్నికల్లో దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో.. ఇలాంటి వాటికి రియాక్ట్ కాకుండా ఉండడమే మంచిదని భావిస్తున్నారట.
ఇప్పటికే లోకేష్ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని గెలికితే ఇబ్బంది వస్తుందని మౌనొంగా ఉంటున్నారట. మరి, ఈ విషయంలో చంద్రబాబు తన చాణక్యతను ఎలా ఉపయోగిస్తారు? కొడుకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి ఎలా బయటపడేస్తారు? అన్నది చూడాలి.