Homeజాతీయ వార్తలుOperation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. బయటపడుతున్న నిజాలు!

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. బయటపడుతున్న నిజాలు!

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్, భారత్‌–పాకిస్తాన్‌ మధ్య జరిగిన సైనిక ఘర్షణ. దక్షిణాసియా రాజకీయాలలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఈ ఆపరేషన్‌ను ఆపడంలో అమెరికా మధ్యవర్తిత్వం చేసిందని డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చెప్పుకుంటున్నాడు. దీని ఆధారంగా భారత్‌లోని విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కానీ, నిజం నిలకడమీద తెలుస్తుంది అన్నట్లుగా.. యుద్ధం ముగిసిన మూడు నెలల తర్వాత వాస్తవాలు బయట పడుతున్నాయి.

ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ విజయం

ఆపరేషన్‌ సిందూర్, ఏప్రిల్‌ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్‌ మే 7న ప్రారంభించిన సైనిక చర్య. ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించారు, దీనిని పాకిస్తాన్‌ మద్దతు గల లష్కర్‌–ఎ–తొయిబాకు చెందిన ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) నిర్వహించినట్లు భారత్‌ ఆరోపించింది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం పాకిస్తాన్, పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది మరియు 11 ఎయిర్‌ బేస్‌లకు గణనీయమైన నష్టం కలిగించింది. పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ ధర్‌ ఈ ఆపరేషన్‌ వల్ల తమ దేశానికి తీవ్ర నష్టం జరిగినట్లు ఒక టీవీ ఇంటర్వ్యూలో అంగీకరించారు, ఇది భారత్‌ యొక్క సైనిక సామర్థ్యాన్ని సూచిస్తుంది. దీంతో యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్‌ ఇచ్చారు.

ట్రంప్‌ వింత వాదనలు..

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆపరేషన్‌ సిందూర్‌ సీజ్‌ఫైర్‌లో తాను మధ్యవర్తిత్వం చేసి, భారత్‌–పాకిస్తాన్‌ మధ్య అణుయుద్ధాన్ని నివారించానని పదేపదే పేర్కొన్నారు. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ఖండించారు. మూడో జోక్యం లేదని స్పష్టం చేశారు. తాజాగా పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ ధర్‌ ఈ వాదనలను స్పష్టంగా ఖండించారు. ఇషాక్‌ ధర్‌ తమ దేశం అమెరికాతో ఒక్కసారి మాత్రమే సంప్రదించినట్లు, అది కూడా డీజీఎంవో(డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌) స్థాయి చర్చల తర్వాత సీజ్‌ఫైర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారత్‌ కూడా సీజ్‌ఫైర్‌ ద్వైపాక్షిక చర్చల ఫలితమని, ఎటువంటి మధ్యవర్తిత్వం లేదని నొక్కి చెప్పింది. ట్రంప్‌ వింత వాదనలు భారత్‌లోని విపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారాయి.

విపక్షాల రాజకీయ విమర్శలు..

భారత్‌లోని విపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, ట్రంప్‌ వాదనలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. పాకిస్తాన్‌ ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలొగ్గిందని, ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపడంలో అమెరికా జోక్యం ఉందని ఆరోపించాయి. అయితే, భారత ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరించింది, తాము ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కచ్చితమైన, నియంత్రిత చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. ఇషాక్‌ ధర్‌ ఇంటర్వ్యూ ఈ విమర్శలకు సమాధానంగా నిలిచినప్పటికీ, విపక్షాలు దీనిని కూడా రాజకీయంగా వాడుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తమదే విజయమని పాకిస్తాన్‌ సంబరాలు..

ఇదిలా ఉంటే ఆపరేషన్‌ సిందూర్‌లో తామే విజయం సాధించామని పాకిస్తాన్‌ సంబరాలు చేసుకుంది. సైనికాధికారి ఆసిమ్‌ మునీర్‌కు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌గా పదోన్నతి కూడా ఇచ్చారు. కానీ ఇషాన్‌ ధర్‌ మాత్రం ఆపరేషన్‌ సిందూర్‌తో తాము తీవ్రంగా నష్టపోయామని ప్రకటించారు. అంతకుముంద పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆపరేషన్‌ సిందూర్‌లో మరణించిన సైనికుల జాబితాను ప్రకటించి, వారికి అవార్డులు ఇచ్చింది. ఇషాక్‌ ధర్‌ యొక్క ఒప్పుకోలు ఆపరేషన్‌ సిందూర్‌ వల్ల పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం జరిగిందని స్పష్టమైంది.

ఆపరేషన్‌ సిందూర్‌ సీజ్‌ఫైర్‌ ద్వైపాక్షిక చర్చల ద్వారా జరిగినట్లు భారత్, పాకిస్తాన్‌ ధ్రువీకరించాయి. భారత్‌ ఎల్లప్పుడూ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించింది, ఈ సందర్భంలో కూడా పాకిస్తాన్‌ అభ్యర్థన మేరకు సీజ్‌ఫైర్‌ జరిగిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇషాక్‌ ధర్‌ యొక్క ఒప్పుకోలు ట్రంప్‌ వాదనలను ఖండించడమే కాక, భారత్‌లోని విపక్షాల ఆరోపణలకు కూడా గట్టి సమాధానంగా నిలిచింది. భారత్‌ సైనిక, దౌత్యపరమైన విజయం ఈ ఘర్షణలో ఆధిపత్యాన్ని రుజువు చేస్తుంది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version