BRS Office In Delhi: భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం దాదాపుగా ఖరారైంది. మే 4న కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మే 2న ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. వసంత విహార్‌లో ప్రారంభించిన పార్టీ కార్యాలయాన్ని 4న ప్రారంభిస్తారు.
ఇప్పటికే తాత్కాలిక కార్యాలయం..
జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన కేసీఆర్… ఢిల్లీలో కేంద్ర కార్యాలయ నిర్మాణానికి గతంలో శంకుస్థాపన చేశారు. అక్టోబర్ 5న టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. అనంతరం ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లోని అద్దె భవనంలో డిసెంబర్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఇందులో రాజశ్యామల యాగం కూడా చేశారు. అయితే ఇప్పుడు సొంత భవన నిర్మాణం పూర్తయింది. దీంతో ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు.
ఇక జాతీయ రాజకీయాలపై ఫోకస్..
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మరింత ఫోకస్ చేయనున్నారు. ఢిల్లీలో బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటుగా.. బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులతో కీలక మంతనాలు జరపనున్నారు. ఆదివారం తెలంగాణ నూతన సచివాలయం భవనం ప్రారంభోత్సవం తర్వాత మే 1 లేదా 2వ తేదీన కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఆయన వివిధ విపక్ష పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. మే 4వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
1,100 చదరపు మీటర్లలో నిర్మాణం..
కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ 2020, అక్టోబర్‌లో ఢిల్లీలోని వసంత్ విహార్‌లో 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని పార్టీ శాశ్వత కార్యాలయ నిర్మాణం కోసం టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్)కి కేటాయించింది. 2021, సెప్టెంబర్‌లో భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 20 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభోవత్సరం సందర్భంగా కేసీఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమమంలో తెలంగాణ మంత్రులు, బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా 200 మంది పార్టీ నేతలు హాజరుకానున్నట్టు సమాచారం. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించనున్నట్టు తెలిసింది.
అటు నుంచి కార్ణటకకు..
ఢిల్లీ పర్యటన అనంతరం కేసీఆర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరపున ప్రచారం చేస్తారని పార్టీ అంతర్గత సమాచారం. జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కర్ణాటకలో తమ పార్టీకి ప్రచారం చేయాల్సిందిగా కేసీఆర్‌ను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. అయితే కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని సమాచారం. ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఎన్నికల నేపథ్యంలో దూకుడు..
ఎన్నికల ఏడాది కావటంతో కేసీఆర్ మరింత స్పీడు పెంచారు. ఒకటి తర్వాత ఒకటి కీలక కార్యక్రమాలను పూర్తిచేస్తున్నారు. ఈక్రమంలోనే హైదరాబాద్ సాగరతీరంలో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని అంబేడ్కర్ జయంతి రోజున ప్రారంభించారు. ఈనెల 30న నూతన సచివాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. మే 2 తేదీన ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్… 4వ తేదీన పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారు.