
Rahul Gandhi: ఎక్కడ సందు దొరుకుతుందోనని ఎదురు చూస్తున్న కేంద్రానికి.. రాహుల్ సులభంగా దొరికిపోతున్నాడు. కేంద్రానికి లక్ష్యమవుతున్నాడు. ఆ మధ్య జోడోయాత్ర సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్.. లండన్ లోనూ భారత ప్రభుత్వంపై నోరు జారాడు. అది కూడా బీబీసీ మీద ఐటీ సోదాలు జరుగుతున్నప్పుడు.. ఈ విషయాన్ని తెలివిగా బీజేపీ టాకిల్ చేసింది. అంతే కాదు మోడీ పై అనుచితంగా మాట్లాడినందుకు ఇప్పుడు ఏకంగా పార్లమెంటుకే దూరం చేయబోతోంది. ఇందులో బిజెపి అత్యుత్సాహం కన్నా… రాహుల్ గాంధీ స్వయంకృతాపరాధమే ఎక్కువగా ఉన్నది.
కిం కర్తవ్యం?!
“అక్రమాలకు పాల్పడే వారికి మోదీ అన్న ఇంటి పేరే ఎందుకుంటుంది” అని విమర్శించిన వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది..ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పార్లమెంటు సభ్యుడిగా రాహుల్ అనర్హుడయ్యారు. ఆయన సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం కూడా రద్దు చేసింది. మరి, ఇప్పుడు రాహుల్ ఎదుట ఉన్న మార్గాలేమిటి? ఎంపీగా కొనసాగాలంటే ఆయన సుదీర్ఘ న్యాయ పోరాటం చేయక తప్పదా? అంటే.. ఇందుకు ఒకే ఒక మార్గం ఉంది. అది.. రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ సూరత కోర్టు ఇచ్చిన తీర్పుతోపాటు ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేయడం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన 374 ప్రకారం రాహుల్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. తీర్పుపైనా, శిక్షపైనా అక్కడ స్టే ఇస్తే సరేసరి. లేకపోతే, పైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీం కోర్టుకు కూడా వెళ్లవచ్చు. ఎక్కడికి వెళ్లినా.. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుతోపాటు శిక్షపై కూడా స్టే ఇస్తేనే రాహుల్‌కు ఊరట లభిస్తుంది. అనర్హత ముప్పు ఆయనకు తప్పుతుంది. ఏ కోర్టులోనూ రాహుల్‌కు ఊరట లభించకపోతే, ఎనిమిదేళ్లపాటు ఆయన ఏ ఎన్నికల్లోనూ (పార్లమెంటు, అసెంబ్లీ) పోటీ చేయడానికి ఉండదు.
నాడు లాలూ ప్రసాద్ యాదవ్ ను కాపాడబోయి..
చట్టసభ సభ్యులకు రెండేళ్లు, అంతకుమించి శిక్ష విధిస్తే తక్షణమే అనర్హత వేటు పడుతుందని లిల్లీ థామస్ కేసులో 2013లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.. అప్పట్లో ఎంపీగా ఉన్న ఆర్జెడి నేత లాలు ప్రసాద్ యాదవ్ పై అనర్హత వేటు పడింది. తీర్పును నీరు గార్చేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ మేరకు ఒక ఆర్డినెన్స్ కూడా తెచ్చింది. అప్పుడు రాహుల్ గాంధీ ఈ అర్డి నెన్స్ ను విలేకరుల సమావేశం పెట్టి మరీ చించేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ ఆర్డినెన్స్ కు గురికావడం విశేషం.

వయనాడ్ ఉప ఎన్నిక ఉంటుందా?
రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. మరి, ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుందా!? ఎన్నికల కమిషన ఆగమేఘాలపై షెడ్యూల్ ప్రకటించి, ఎన్నిక నిర్వహిస్తే తప్ప ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండదు. ఈ నెల 23న సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. అప్పీలుకు నెల రోజుల గడువు ఇచ్చింది. ఈసీ అప్పటి వరకూ వేచి చూస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఓ హత్యాయత్నం కేసులో ఇటీవల జైలు శిక్ష పడిన లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటు పడడంతో ఈసీ ఆగమేఘాలపై నోటిఫికేషన్ జారీ చేసింది. సెషన్స కోర్టు స్టే ఇవ్వడంతో ఆ నోటిఫికేషన్ నిలిపి వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, వయనాడ్ ఎన్నికపై ఈసీ వెన్వెంటనే నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఇక, ప్రస్తుత 17వ లోక్‌సభ పదవీ కాలం జూన 16వ తేదీతో ముగుస్తుంది. సాధారణంగా, ఎన్నికైన సభ్యుడికి కనీసం ఏడాదిపాటు పదవీ కాలం ఉంటేనే ఉప ఎన్నిక నిర్వహిస్తారు. దీని ప్రకారం చూస్తే.. ఉప ఎన్నికను పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ కు దాదాపు నెలన్నర మాత్రమే సమయం ఉంటుంది. ఈ నేపథ్యంలో, వయనాడ్ ఉప ఎన్నిక ఉండకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.