కొన్ని సంఘటనలు విస్తుగొలుపుతాయి. ఆ మాటల్లో నిజమెంతో తెలిసినా జరిగిన దానికి మాత్రం అందరు ఆశ్చర్యపోతున్నారు. మహిళ చెప్పిన విధంగానే సంఘటన చోటుచేసుకోవడంతో జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఆమెకు ఏవైనా శక్తులున్నాయో ఏమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ యుగంలో కూడా కలలకు ఇంత శక్తులున్నాయా అని పలువురిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది నిజమో ఏది అబద్దమో తెలియని సందిగ్ధం నెలకొంది. దేవుడి మహిమతోనే సాధ్యమైందని చెప్పడం కొసమెరుపు.
కృష్ణ జిల్లా మూలలంక గ్రామంలో శివాలయం నిర్మాణం కోసం 30 ఏళ్ల కిందట కొంత భూమిని కేటాయించారు. కానీ అక్కడ ఏ నిర్మాణం చేపట్టలేదు. ఖాళీగానే ఉంది. ఇటీవల అక్కడ సచివాలయం నిర్మించాలని నిర్ణయించారు. దీంతో పనులు ప్రారంభించాలని సమాయత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ కొలతలు వేసి మార్కింగ్ చేశారు. ఇంతలోనే అనుకోని మలుపు తిరిగింది.
అదే గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ లక్ష్మి(మంగమ్మ) అక్కడకు చేరుకుని నిర్మాణం చేయొద్దని సూచించింది. తనకు కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ శివలింగం ఉందని నిర్మాణం ఆపాల్సిందిగా చెప్పింది. కానీ ఎవరు నమ్మకపోవడంతో పనులు మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆమె తన వాదనను మరింత పెంచి అందరిలో విశ్వాసం కలిగేలా తెలిపింది.
దీంతో సదరు మహిళ సూచించిన ప్రాంతంలో రెండు మీటర్లు తవ్వి చూడగా శివలింగం దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. మహిళకు ఏవో శక్తులున్నాయని భావించి పూజలు చేస్తున్నారు. అక్కడ గుడి నిర్మించేందుకే నిర్ణయించుకున్నారు. ఆమెకు కలలో శివుడు ప్రత్యక్షమై ఇక్కడ శివాలయం నిర్మించాలని చెప్పినట్లు పేర్కొంది. దీంతో ఆమె మాటలు నిజమయ్యాయని ప్రజలు దేవతగా అభివర్ణిస్తూ పూజలు జరపడం గమనార్హం.