Omicron Effect in India: భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. అందరూ భయపడుతున్నట్టుగానే.. జనవరిలో ఒక్కసారిగా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్క రోజునే 90వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇవి థర్డ్ వేవ్‌కు సంకేతంలా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలెర్ట్ అయిపోతున్నాయి. ఇక కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో నేడు ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు.
Omicron Effect in India
చూస్తుండగానే రోజురోజుకూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రంగా కోరలు చాస్తోంది. పాజిటివిటీ రేటు 6.43 శాతంగా నమోదు కావడం కూడా కలవర పెడుతోంది. ఇది ఇక్కడితో ఆగుతుందనే గ్యారెంటీ లేదు. ఈ వారంలో రోజుల్లోనే కేసులు అమాంతం పెరిగిపోతున్నాఇయ. ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాల్లో సెకండ్ వేవ్‌ను తలపించేలా కేసులు నమోదవుతున్నాయి
Also Read: థర్డ్ వేవ్ వచ్చినట్టే.. దేశంలో కరోనా కల్లోలం షురూ!
ఈ రేంజ్‌లో కేసులు రావడంతో ఆయా రాష్ట్రాల్లో ముందస్తు ఆంక్షలు విధించేశాయి ప్రభుత్వాలు. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్లు, స్కూళ్లు, కాలేజీల మూసివేత లాంటి చర్యలు తీసుకుంటున్నాయి. జనవరి చివరి నాటికి థర్డ్ వేవ్ రావొచ్చనే భయాందోళన అందరినీ కలవర పెడుతోంది. దీంతో రాష్ట్రాలకు అన్ని అధికారాలు వదిలేయకుండా నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. ఈ రోజు అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకోనున్నారు. మొదటి, సెకండ్ వేవ్ అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరోసారి అలాంటి దుస్థితి రాకుండా ఉండేందుకు ముందస్తుగానే చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎంలకు సూచనలు కూడా చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా సీఎంలకు కొన్ని సలహాలు, ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విధించిన నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లు అలాగే ఉంచే అవకాశం ఉంది.
ఇక దేశ వ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ విషయం మీద అలాగే ముందస్తుగా చేపట్టాల్సిన అన్ని చర్యల మీద మాట్లాడుతారని తెలుస్తోంది. అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించకపోతే.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి సంపూర్ణ లాక్ డౌన్ విధించుకునే అధికారాలను కూడా సీఎంలకే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల దాకా అన్ని కార్యకలాపాలను నడిపించి, ఆ తర్వాత మళ్లీ ఉదయం 6 గంటల దాకా లాక్ డౌన్ విధించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read: తెలంగాణలో కోరలు చాస్తున్న కరోనా.. లాక్ డౌన్ తప్పదా..?