ఒలింపిక్స్ లో భారత్ కు రెండు పతకాలు సాధించిన రెజ్లింగ్ క్రీడాకారుడు సుశీల్ కుమార్ ఓ హత్య కేసులో ఇరుక్కున్నాడు. తన శిష్యుడినే హత్య చేశాడనే ఆరోపణలపై కొన్నాళ్లపాటు పరారీలో ఉన్న సుశీల్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిపై పోలీసుల రూ.లక్ష రివార్డు ప్రకటించారు. సుశీల్ కుమార్ కు ఢిల్లీలోని మోడల్ టౌన్ లో ఒక ఇల్లు ఉంది. అందులో రెజ్లర్ సాగర్ కుమార్ ధన్ కర్ కొన్నాళ్లు అద్దెకు ఉన్నాడు. ఈ క్రమంలో అతడు అద్దె సక్రమంగా చెల్లించలేదు. దీంతో సుశీల్ కుమార్ కు అతనికి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో నాలుగు నెలల క్రితం ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే చోటుకు మారిపోయాడు. ఆ తర్వాత నుంచి సుశీల్ కుమార్ ను సాగర్ అందరి ఎదుట దూషించడం మొదలు పెట్టాడు. దీంతో తన ప్రతిష్ట దెబ్బతింటుందని సుశీల్ ఆగ్రహం చెందాడు.
మే 4న అర్ధరాత్రి చైత్రపాల్ స్టేడియం వద్ద సుశీల్, ఆయన బృందం హాకీ బ్యాట్లు, క్రికెట్ బ్యాట్లతో తమపై దాడి చేసిందని క్షతగాత్రుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి అనంతరం రాత్రి 2 గంటల సమయంలో స్టేడియంలో అథ్లెట్లు ఉన్నట్లు తెలిసింది. సుశీల్ కుమారే ఫోన్ చేసి స్టేడియం వద్ద ఘర్షణ జరిగినట్లు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఐదు కార్లు ఉన్నాయి. అందుల తూటాలు నింపిన గన్, మూడు కార్బైడ్లు దొరికాయి. ముగ్గురు తీవ్ర గాయాలతో పడిపోయి ఉన్నారు. వారిలో సాగర్ చికిత్స పొందుతూ మరణించాడు. సుశీల్ బృందం చేసిన దాడిలో సోనుమోనల్, అమిత్ కుమార్ అనే వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో 20 మంది పాల్గొన్నట్లు సమాచారం.
సాగర్ ధన్కర్ హరియాణాలోని సోనిపట్ కు చెందిన యువకుడు. సుశీల్ కుమార్ విజయాలను చూసి స్ఫూర్తి పొంది రెజ్లర్ గా మారాడు. 8 ఏళ్ల పాటు చైత్రపాల్ స్టేడియంలో శిక్షణ పొందాడు. గురువుగా భావించిన సుశీల్ కుమార్ సాగర్ ను హత్య చేయడం చర్చనీయంశంగా మారింది. హత్యను కొందరు మొబైల్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గాయపడిన సాగర్ 5న మరణించాడు. అప్పటి నుంచి సుశీల్ కుమార్ అదృశ్యం అయిపోయాడు.
ఇండియన్ రైల్వేస్ లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ గా పని చేస్తున్న సుశీల్ కుమార్ ను కొన్నాళ్ల క్రితం చైత్రపాల్ స్టేడియానికి ఓఎస్డీగా నియమించారు. ది స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కూడా. ఈ ఫెడరేషన్ కు గుర్తింపు లేదు. 2012 ఒలింపిక్స్ తర్వాత సుశీల్ చాలా వ్యాపారాలు చేశారు. ఒక దశలో టోల్ ప్లాజాల కాంట్రాక్టులు దక్కించుకున్నాడు. దీంతో చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. కొన్నాళ్ల క్రితం పర్వీన్ అనే రెజ్లర్ పై దాడి చేశాడు. నర్సింగ్ యాదవ్ అనే రె జ్లర్ నిషేధిత ఉత్ర్పేరకాలు వాడి సస్పెండ్ కావడం వెనుక సుశీల్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.