
Chandrababu- Jagan: ఆ ప్రతిపక్ష నేతను వృద్ధాప్యం వెంటాడుతోంది. మరోసారి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షకు అడ్డు తగులుతోంది. గత్యంతరం లేక పొత్తుల కోసం అర్రులు చాస్తున్నారు. చాపకింద నీరులా విస్తరిస్తున్నారు. ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నారు. అయితే ప్రతిపక్ష నేత వృద్ధాప్యమే అధికార పార్టీ అధినేతకు వరంగా మారుతోంది. ప్రతిపక్షాన్ని ఎదగనీయకుండా అడ్డుకుంటోంది.
ఏపీలో చంద్రబాబు రూపంలో జగన్ కు మరో అవకాశం దక్కనుందా ? అంటే అవుననే కొన్ని వర్గాల నుంచి సమాధానం వస్తోంది. దీనికి కారణం చంద్రబాబు వృద్ధాప్యమే. వృద్ధాప్యంతో చంద్రబాబు పార్టీ పటిష్టత పై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. గతంలోలాగా పూర్తీస్థాయిలో చురుగ్గా పనిచేయలేని స్థితి ఉంది. దీంతో వారసుడిగా లోకేష్ కు బాధ్యతలు అప్పగించారు. కానీ లోకేష్ ఇన్నేళ్లు తండ్రిచాటు బిడ్డగా ఉండటం, ఎదురుదెబ్బలు తినకపోవడంతో రాజకీయంగా పరిపక్వత సాధించలేకపోయారు. రాజకీయాల్లో రాటుదేలాలంటే ఎదురుదెబ్బలు తినాలి. తిరిగి లేచి వాటిని ఎదుర్కొనాలి. ప్రత్యర్థులను ఢీకొనే శక్తియుక్తుల్ని కూడదీసుకోవాలి. కానీ లోకేష్ కు ఇలాంటి అవసరం ఎప్పుడూ రాలేదు. అందుకు కారణం చంద్రబాబు యాక్టివ్ పాలిటిక్స్ లో చురుగ్గా ఉండటం. ఇప్పుడు ఇదే తెలుగుదేశానికి మైనస్ పాయింట్ అవుతోంది.
ఏపీలో అవకాశం దొరికితే మరోసారి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష చంద్రబాబుకు ఉండనే ఉంటుంది. చింత చచ్చినా పులుపు చావదన్నట్టు. కానీ వృద్ధాప్యం ఆ ఆశను నిరాశగా మిగిల్చుతోంది. ఇప్పుడు అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయే అవకాశం ఉంది. లోకేష్ సమర్థత పై టీడీపీలో నమ్మకం లేదు. కేవలం చంద్రబాబు మేనేజ్మెంట్ పాలిటిక్స్ పైనే టీడీపీ నేతలు ఇన్నాళ్లు ఆధారపడుతూ వచ్చారు. కానీ ఆయన వృద్ధాప్యంతో టీడీపీ నేతలకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. తప్పదు కాబట్టి లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించాల్సి వస్తోంది. ఇటీవల టీడీపీ నేతల మాటలు చూస్తే అర్థమవుతోంది. తామే లోకేష్ ను ప్రజానాయకుడిగా తీర్చుదిద్దుకోవాల్సిన అవసరాన్ని టీడీపీ నేతలు గుర్తించినట్టు కనిపిస్తోంది.

మూడున్నర సంవత్సరాల జగన్ పాలనలో చాలా వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. కానీ ఆ అసంతృప్తిని చంద్రబాబు తన వైపు తిప్పుకోలేకపోయారు. దీంతో ఏపీలో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. ప్రతిపక్షాల ఓటు చీలనివ్వకుండా ఎత్తులు వేస్తున్నారు. కానీ అది ఎంతమేరకు విజయవంతం అవుతుందో కాలమే సమాధానం చెబుతుంది. చంద్రబాబు వృద్దాప్యమే జగన్ కు వరంగా మారుతోంది. చంద్రబాబు వృద్ధాప్యం ఒకరకంగా టీడీపీ నేతల స్థైర్యాన్ని సన్నిగిల్లేలా చేస్తోంది. అందుకే చాలా మంది టీడీపీ నేతలు ఇన్నాళ్లు యాక్టివ్ గా లేరు. భవిష్యత్తులో ఏమవుతుందో అన్న ఒక అనుమానం టీడీపీ నేతల్లో నెలకొంది. దీనికి ప్రధానం కారణం జగన్ అని చెప్పవచ్చు. చంద్రబాబు వృద్ధాప్యం, లోకేష్ రాజకీయ అపరిపక్వతను గమనించిన వైసీపీ.. లోకేష్ ను ఒక అసమర్థ రాజకీయ నాయకుడిగా ముద్ర వేసే ప్రయత్నం చేసింది. చాలా వరకు ఇందులో విజయవంతం అయిందని చెప్పవచ్చు. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసింది.
లోకేష్ ను అసమర్థుడి వైసీపీ ప్రచారం చేస్తూ.. టీడీపీ కేడర్ లో ఒక నిరుత్సాహాన్ని సృష్టించింది. ఇప్పటికీ టీడీపీ కేడర్ క్రియాశీలకంగా పనిచేయకపోవడానికి ఈ ప్రచారమే కారణం. భవిష్యత్తు పై ఆందోళన టీడీపీ కింది స్థాయి కేడర్ లో ఉంది. వైసీపీని ధీటుగా ఎదుర్కోకపోవడానికి ఇదే కారణమని చెప్పవచ్చు. టీడీపీలో ఇలాంటి ఆందోళనను సృష్టించడంలో వైసీపీ సక్సెస్ అయింది. ఇదే అదునుగా టీడీపీలో బలంగా ఉన్న నేతల్ని తన వైపు తిప్పుకుంది. మరికొంత మంది వైసీపీలో స్థానికంగా అవకాశం లేకపోవడంతో టీడీపీలోనే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. టీడీపీకి పూర్వవైభవం దక్కాలంటే .. ప్రస్తుతం అది లోకేష్ సమర్థత పైనే ఆధారపడి ఉంటుంది. పాదయాత్రలో ఎంత మేరకు పరిపక్వత సాధిస్తారనే అంశం పై ఆధారపడి ఉంటుంది.
