Land Kabza Issue: మాట మాట్లాడితే నిజాయితీ, నిబద్ధత గురించి వల్లె వేసే ప్రభుత్వ పెద్దలు క్షేత్రస్థాయిలో మాత్రం దానిని చూపించరు. పైగా తమ సొంత ప్రాపకం కోసం ఎక్కడి దాకైనా వెళ్తారు. తమ ప్రయోజనాలకు అడ్డువస్తే ఎంతటి అధికారినైనా పక్కకు తప్పిస్తారు. పక్కకు తప్పుకోమంటారు. సరిగా ఇలాంటిదే తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. నిజాయితీగా పనిచేసిన ఒక కలెక్టర్ ను, ప్రభుత్వ భూమిని కాపాడిన ఆమె దార్శనికతను మెచ్చుకోవాల్సింది పోయి ప్రభుత్వం పక్కకు తప్పించింది. అదే కాదు తన పార్టీ నాయకులకు వెసలు బాటు కలిగేలా నిర్ణయం తీసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ని ప్రభుత్వం ఉన్నట్టుండి బదులు చేసింది. ఆమెను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అయితే ఆమె బదిలీ వెనుక 600 కోట్ల విలువైన చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ పరిధిలోని 401 ఎకరాల కాంది శీకుల భూములను కాజేసేందుకు స్కెచ్ వేసిన ఒక కీలక ప్రజా ప్రతినిధి ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి, మరో ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆమెను తప్పించారని తెలుస్తోంది. అంతేగాక ఆ భూముల వ్యవహారాన్ని క్షేత్రస్థాయిలో అనుకూలంగా మలచుకునేందుకు తాము చెప్పినట్టు నడుచుకునే అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి జిల్లా వరకు మార్గం సుగమం చేసుకునే క్రమంలో చౌటుప్పల్ ఆర్డీవోను కూడా బదిలీ చేయించారు. తాజాగా యాదాద్రి జిల్లా కలెక్టర్ ను కూడా బదిలీ చేయించారు. పమేలా స్థానంలో యాదాద్రి కలెక్టర్ గా 2013 ఐఏఎస్ బ్యాచ్ కు వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు విడుదల చేశారు.

600 కోట్ల విలువ చేసే కాంతి శీకుల భూములను కాజేసే ప్రయత్నాల్లో మంత్రి, ఓ ఎమ్మెల్యే కీలక పాత్రధారులుగా ఉన్నట్టు జూలై 26న ఓకే తెలుగు ఒక కథనాన్ని పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ భూముల వ్యవహారంలో తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని మంత్రి, జిల్లా కీలక అధికారాన్ని పిలిపించి చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులను మొత్తం మారిస్తే తప్ప తమకు భూములు తక్కువ అని వారు ఒక అంచనాకొచ్చి.. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక్కొక్క అధికారిని బదిలీ చేయించినట్టు తెలుస్తోంది. ఆర్డీవోను, కలెక్టర్ బదిలీ వెనుక కారణం ఇదే అని సమాచారం.
ఇక ఉన్నతాధికారులను మొత్తం తప్పించిన తర్వాత ఆ మంత్రి, ఇంకో ఎమ్మెల్యే కలిసి తమకు మునుగోడు ఉప ఎన్నికల్లో సహకరించిన అధికారుల బృందాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితికి కొమ్ముకాసి ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురైన డిప్యూటీ కలెక్టర్ కు యాదాద్రి భువనగిరి ఆర్డీవో గా అవకాశం ఇవ్వడం కూడా ఈ వ్యూహంలో భాగమని తెలుస్తోంది. ఎన్నికల సంఘం చీవాట్లు పెట్టిన అధికారిని ప్రాధాన్యం లేని పోస్టులో కొనసాగించాలి. అలా కాకుండా కీలక స్థానాన్ని కట్టబెట్టి విధేయతకు బహుమానం ఇచ్చినట్టు తెలుస్తోంది.
దండు మల్కాపూర్ కాంది శీకుల భూములను కాజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇటీవల ఒక్కొకటిగా వెలుగులోకి వచ్చాయి. విభజన సమయంలో ఈ భూముల యజమాని మీర్జా మక్సూద్ అలీ ఖాన్ పాకిస్తాన్ వెళ్లిపోయారు. ఈయనకు చెందిన 1407.18 ఎకరాలలో 401.36 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం.. పాకిస్తాన్ నుంచి వచ్చి మహారాష్ట్రలోని కళ్యాణ్ లో ఉంటున్న రాధా బాయి, కొల్హాపూర్ కు చెందిన తహిల్మిల్ కుటుంబాలకు ఇచ్చింది. వీరిద్దరూ ఈ భూముల వద్దకు ఎప్పుడూ రాలేదు. శిస్తు కూడా చెల్లించలేదు. వీరిద్దరూ చనిపోయిన తర్వాత కొందరు దండు మల్కాపూర్ భూమిపై హక్కులున్నాయంటూ వచ్చారు. పాస్ పుస్తకాలు ఇవ్వాలని, ఫౌతీ అమలు చేయాలని చౌటుప్పల్ తహసీల్దార్ ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 2019లో ఫిబ్రవరి నెలలో కళ్యాణ్, కొల్హాపూర్ కలెక్టర్లకు యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి లేఖ రాసినా సమాధానం రాలేదు. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగడం, అధికారులు బదిలీ కావడం ఒక్కొక్కటిగా జరిగిపోయాయి.