YCP Advisors Scam: ఏపీలో సలహాదారుల రాజకీయం నడుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను తిట్టారని ఒకర్ని.. గత ఎన్నికల్లో పార్టీకి ఊపుతెచ్చే పాట పాడారని మరొకర్ని.. తమకు అనుకూలంగా తీయబోయే సినిమా నిర్మాతను.. ఇలా అందరికీ సలహాదారుల పదవి కట్టబెట్టేశారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారని కొందర్ని.. వచ్చే ఎన్నికల్లో పనికొస్తారని మరికొందర్ని సలహదారుల కొలువులిచ్చి లక్షలకు లక్షల వేతనాలు చెల్లిస్తున్నారు. చివరకు ఇంటర్ పాసవ్వని వారిని వ్యవసాయ శాఖకు… కంప్యూటర్ లో ఓనమాలు తెలియని వారిని ఐటీ శాఖకు సలహాదారులుగా నియమించారు. వారిని.. వీరిని అని చెప్పలేం కానీ వందలాది మందిని సలహాదారులుగా నియమించి కోట్లాది రూపాయల వేతనాలు అందిస్తున్నారు. కానీ వీరెంతమంది ఉన్నారో ప్రభుత్వానికీ తెలియదట. ఇప్పుడు అదే మాటను కోర్టుకు కూడా చెప్పేశారు. ఆ నెపాన్ని ప్రభుత్వ శాఖల మీద పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

సలహాదారుల పదవులను గత ప్రభుత్వాలు ఫాలో అయ్యేవి. కానీ ఇంత గరిష్ఠ సంఖ్యలో నియమించలేదు. కానీ జగన్ సర్కారు తమ సొంత వారికి ఎడాపెడా పదవులు కట్టబెట్టేసింది. జగన్ సొంత సామాజికవర్గానికి చెందిన వారినైతే ఐఏఎస్ లకు సమాంతర స్థానంలో కూర్చోబెట్టి వారితో సమానంగా జీతాలు చెల్లిస్తోంది. ఉత్తర్వులు బయటపెట్టని సలహాదారులుగా నియమించబడిన వారు ఎంత మంది ఉన్నారో ప్రభుత్వానికి తెలియదు. అయితే ప్రస్తుతం సలహదారుల ఇష్యూ న్యాయస్థానం ముందుకొచ్చింది. దీంతో లెక్క చెప్పాల్సిన తప్పనిసరి పరిస్థితి ఎదురైంది. దీంతో ప్రభుత్వం ఈ లెక్క తీసే ప్రయత్నం చేస్తోంది. ఎంత మంది సలహాదారులు ఉన్నారు? వారికి ఎంత జీతభత్యాలు ఇస్తున్నారు? వంటి వివరాలను నివేదించాలని అన్ని శాఖలకు ఆదేశించింది.
అయితే ఇలా కోర్టు ఆదేశించిందో లేదో ఎంతో శ్రద్ధతో ప్రభుత్వం అన్ని శాఖలకు పనిచెప్పడం చర్చనీయాంశమైంది. మూడున్నరేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందలాది తీర్పులు వచ్చాయి. కోర్టు ఆదేశాలు బేఖాతరయ్యాయి. ధిక్కార పిటీషన్లు దాఖలయ్యాయి. అయినా ఏదో సాకు చూపి కోర్టు ఆదేశాలు అమలుచేయని ప్రభుత్వం సలహాదారుల కేసుల విషయంలో ఆఘమేఘాల మీద ఆదేశాలివ్వడం హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ఈ సలహాదారుల నియామక పాపం మాది కాదని.. శాఖల వారీగా అధికారుల అవసరంగా భావించి నియమించుకున్నారని నెపం నెట్టేసేందుకేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

వాస్తవానికి సలహాదారుల నియామకం గురించి కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకే తెలియదు. తమ నియోజకవర్గంలో వారిని నియమిస్తున్నా కనీస సమాచారం ఇవ్వలేదు. ఈ తతంగమంతా సకల శాఖ మంత్రి సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆఫీసు నుంచి జరిగిందే. వెనుకబడిన వర్గాల వారికి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా నియమించేటప్పుడు మాత్రం ఉత్తర్వులిస్తున్నారు. అదే లక్షలాది రూపాయల వేతనాలు, అలవెన్స్ లు కట్టబెట్టే వారి విషయంలో నియామక ఉత్తర్వులు బయటపెట్టడం లేదు. సలహాదారుల రూపంలో లక్షలాది రూపాయల వేతనాలు అప్పనంగా ముట్టజెబుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కొత్త ఎత్తుగడ వేశారు. అటు కోర్టుకు తప్పుదోవ పట్టించేలా.. భవిష్యత్ లో అధికారులు బోనులో నిలబడేలా ఆ నియామకాలన్నీ శాఖల వారీగా చేసినవేనని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఇష్యూలో అధికారులు మూల్యం చెల్లించుకుంటారన్న మాట.