NTV Vs TV9: మొన్ననే నెంబర్ వన్ స్థానంలోకి వచ్చిన టీవీ9 కు ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. వారాల వ్యవధిలోనే ఎన్ టీవీ ఆ స్థానాన్ని లాగేసుకుంది. దీంతో టీవీ9 బజారు కెక్కింది. ఎన్ టీవీ ఛానల్ ను ఉద్దేశిస్తూ రకరకాల ప్రచారాలకు దిగింది. కుట్రలతో నెంబర్ వన్ స్థానాన్ని లాగేసుకోలేరని ఏకంగా రెండు కోట్లు ఖర్చుపెట్టి ప్రచారం చేసింది. అంతకుముందు ఎన్ టివి ని పడగొట్టి.. నెంబర్ వన్ స్థానం లోకి వచ్చిన తర్వాత టీవీ9 ఎంత యాగి చేసిందో మనందరం చూసాం. ఏదో సాధించినట్టు దాదాపు రాష్ట్రాలవ్యాప్తంగా హోర్డింగులు, బిల్ బోర్డులతో ప్రచారం కుమ్మేసింది. ” కుట్రతో ఎవరూ నెంబర్ వన్ కాలేరు.” అంటూ రాసుకొచ్చింది. రాతల్లో ఉన్న తెగువను చేతల్లో చూపించలేకపోయింది. ఎన్ టివి ని కొట్టిన కొద్ది రోజులకే మళ్లీ ఆ స్థానాన్ని దానికి అప్పగించి సైలెంట్ గా రెండవ స్థానంలోకి పడిపోయింది.
రజనీకాంతే బాధ్యుడు
అప్పుడు నెంబర్ వన్ స్థానం సాధించినప్పుడు టీవీ9 ఆఫీసులో కేకుల పండుగలు ఘనంగా జరిగాయి. రజనీకాంత్ ను హీరో రజనీకాంత్ లెక్క ఆ రుధిరం దేవి ప్రొజెక్ట్ చేసింది. తీరా రెండు వారాలు గడిచాయో లేదో ఆ నెంబర్ వన్ గాలికి కొట్టుకుపోయిన పేలపిండి అయిపోయింది. తర్వాత మళ్లీ ఎన్ టివి అగ్రస్థానానికి చేరుకుంది. దీంతో టీవీ9 బాధ్యులు బిక్క మొహాలు వేశారు. అంతేకాదు అప్పట్లో నెంబర్ వన్ స్థానం సాధించినప్పుడు మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు, మేఘ కృష్ణారెడ్డి కళ్ళు కప్పి రెండు కోట్లు ఖర్చుపెట్టి బొంబాట్ ప్రచారం చేశారు. అసలు ఆ ప్రచారానికి ఒనగూరిన సార్ధకత ఏమిటో ఇప్పటికీ ఆ మేనేజ్మెంట్ చెప్పలేకపోతోంది. అప్పట్లో కేకుల పండుగ జరిగినప్పుడు దేవి చెప్పినట్టు.. టీవీ9 ఒకటో ర్యాంకు సాధించడం వెనక రజినీకాంత్ కృషి ఉంటే.. ఇప్పుడు ఆ ప్లేస్ ఎగిరిపోవడానికి కూడా తనే కారణం.. ఇలా అనడానికి ఆ టీవీ9 చేసిన ప్రచారమే కారణం. ఇప్పుడు ఆ టీవీ9 ఏర్పాటు చేసిన హార్డింగుల ప్రకారం ఆ అగ్రస్థానం ఎగిరిపోయినందుకు రజనీకాంత్ కారణమని ఆ చానల్ యాజమాన్యమే చెప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది. పోనీ కుట్రతో నెంబర్ వన్ ఎవరూ కాలేరు అని చెప్తున్నారు అంటే టీవీ9 తనకు తాను అన్యాపదేశంగా తననే కుట్రధారుగా చెప్పుకుంటున్నట్టా? ఈ ప్రకారం చూస్తే టీవీ 9లో పనిచేసే పెద్ద పెద్ద తలకాయలు సరిగ్గా తమ మెదడును వాడుతున్నట్టు కనిపించడం లేదు.
సైలెంట్ గా దెబ్బతీస్తోంది
మరోవైపు ఎన్టీవీ టీవీ9 ను నిశ్శబ్దంగా దెబ్బతీస్తోంది. నెత్తి మాసిన ప్రచారం జోలికి పోకుండా, పైసా ఖర్చు చేయకుండా సైలెంట్ గా ఆపరేషన్ చేస్తోంది. దీనికి ఆధారం ఏంటయ్యా అంటే.. ఒకవేళ టీవీ నైన్ మళ్లీ మొదటి స్థానంలోకి వస్తే.. ఎన్టీవీ మళ్ళీ యాక్టివేట్ అయిపోతుంది. నిజానికి ఈ రేటింగ్స్, ర్యాంకింగ్స్ అనేవి పెద్ద దందా. అప్పట్లో రిపబ్లిక్ ఛానల్ ఎలా చేసిందో మనం చూశాం కదా! తాజా బార్క్ రేటింగ్స్ ప్రకారం ఎన్టీవీ మరో ఐదు పాయింట్లు ఎగబాకింది. ఇదే సమయంలో టీవీ9 ఐదు పాయింట్లు దిగజారి పోయింది. ఈ క్రమంలో టీవీ9 మళ్లీ నెంబర్ వన్ కావాలి అంటే చాలా కష్టమే. ఇక ఇప్పటికే ఎన్ టీవీ, టీవీ9 బజారునపడి కొట్టుకుంటున్న నేపథ్యంలో.. త్వరలో రవి ప్రకాష్ ఆధ్వర్యంలో ఆర్టీవీ కనుక వచ్చేస్తే ఈ పోటీ మరింత రంజుగా మారుతుంది. ఆర్ టి వి అటు టీవీ 9, ఇటు ఎన్ టీవీ ని కచ్చితంగా టార్గెట్ చేస్తుంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఎందుకంటే రవి ప్రకాష్ కు నరేంద్ర చౌదరి అంటే గిట్టదు. అటు కృష్ణారెడ్డి, జూపల్లి రామేశ్వరం మీద పీకలదాకా కోపం ఉంది.. ఆ కక్షను కచ్చితంగా సాధించుకునేందుకు అడుగులు వేస్తున్నాడు.
కీలక ఉద్యోగులు వెళ్ళిపోతున్నారు
వాస్తవానికి టీవీ9 కు ప్రధాన బలం కీలక ఉద్యోగులే. రవి ప్రకాష్ లాంటి వాళ్లు వెళ్లిపోయినప్పటికీ ఆ చానల్ నెంబర్ వన్ స్థానంలో కొద్ది రోజులు కొనసాగిందంటే దానికి కారణం ఆ కీలక ఉద్యోగులు. ఇప్పుడు వారు వెళ్ళిపోతున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే ఇప్పట్లో టీవీ9 మళ్లీ భారీగా మెరుగు పడటం దాదాపుగా అసాధ్యం. మొన్న కేకుల పండుగ రోజు రజనీకాంత్ కుడి, ఎడమ భుజాలుగా చెప్పుకున్న దొంతు రమేష్, వేములపల్లి అశోక్ ఇద్దరూ టీవీ9 ను వదిలేశారు. వారిద్దరి నిష్క్రమణకు రజనీకాంతే కారణమని టీవీ9 ఇంటర్నల్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వాళ్ళిద్దరు కూడా ముఖ్య స్థానంలో ఉన్నవాళ్లే. వీళ్లే కాదు గణేష్, రాజశేఖర్ అనే కీలక జర్నలిస్టులు కూడా నిష్క్రమించారు. వీరిలో అశోక్ ను మినహాయించి మిగతా వారిని ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఎంగేజ్ చేసుకున్నాడని తెలుస్తోంది. వీరికి టీవీ9 లో ఇచ్చే ప్యాకేజీ కంటే మూడు రెట్లు అధికానికి ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇక అశోక్ రవి ప్రకాష్ క్యాంపులో జాయిన్ అయిపోయినట్టు తెలుస్తోంది. త్వరలో మరికొంత మంది కూడా వెళ్ళిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఆర్టీవీ కి సంబంధించి రవి ప్రకాష్, అర్ణబ్ గోస్వామి కి గొడవ జరుగుతున్నది. ఇది ఒక కొలిక్కి వస్తే టీవీ9 నుంచి పెద్ద తలకాయలు వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది.
మేనేజ్మెంట్ ఏం చేస్తోంది
టీవీ9 లో ఇంత జరుగుతుంటే మేనేజ్మెంట్ మాత్రం కళ్ళు మూసుకుంది. జూపల్లి రామేశ్వరరావు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బిజీగా ఉంటే, ప్రాజెక్టుల నిర్మాణంలో మెఘా కృష్ణారెడ్డి ఊపిరి సర్పం అంత బిజీగా ఉన్నాడు.. అంతేకాదు టీవీ9ను మైంటైన్ చేస్తున్న ఓ కీలక వ్యక్తి ఒక పిఏ, పి ఆర్ ఓ, బిజినెస్ అడ్వైజర్, చీఫ్ అడ్వైజర్ ను నియమించుకున్నాడు. వారికి టీవీ9 ఆఫీస్ నుంచే జీతాలు చెల్లిస్తున్నారట! ఇది ఒకటి చాలు టీవీ9 మేనేజ్మెంట్ ఎలా వ్యవహరిస్తుందో చెప్పేందుకు. ఇలాంటి వాటిని ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఎంకరేజ్ చేయడం.. జీతాలు ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే బోనస్ చెల్లింపుదాకా ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా ఉంటాడు.. కానీ ఇది టీవీ9 మేనేజ్మెంట్ కు చేత కావడం లేదు. అదే ఆ చానెల్ ను దెబ్బతీస్తోంది.. ఇప్పటికైనా మేల్కొకపోతే ఆర్టీవి రంగంలోకి రావడం, టీవీ9 ను మరింత కొట్టేయడం ఖాయం..