
NTR Health University : తమకు మంది బలం ఉందని ఏది పడితే అది చేస్తామంటే కుదరదు. పాలనాపరమైన అంశాలు, రాజ్యంగబద్ధ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి, రెండుసార్లు స్టడీ చేయాలి. నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. లేకుంటే మూడు రాజధానుల ముచ్చటగానే మిగులుతుంది. అప్పుడెప్పుడో మూడేళ్ల కిందట మూడు రాజధానులను ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఒక్క అడుగు వేయలేకపోయారు. కానీ కేవలం ప్రకటనల రూపంలో మాత్రం అంతా జరిగిపోయిందని భ్రమ కల్పించారు. సంక్రాంతి, ఉగాది అంటూ పండుగల పేర్లు చెప్పుకొని మహూర్తాలను దాటించారు. ఇప్పుడేమో సెప్టెంబరులో దసరా ముంగిట అంటూ సీఎం జగన్ చెప్పుకొస్తున్నారు. మనం అనుకున్నంత మాత్రాన జరగదు. దానికి సిస్టమేటిక్ గా వెళితేనే కదురుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో అదే పరిస్థితి ఎదురైంది. దానికి వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినంత మాత్రన మారదని కేంద్రం తేల్చేసింది.
కొద్ది నెలల కిందట మార్పు..
కొద్దినెలల కిందట ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ పేరిట మార్చేశారు. దానిని కేబినెట్ మంత్రుల నుంచి వైసీపీ నేతల వరకూ సమర్థించుకున్నారు. మార్పు సహేతుకుమేనని చెప్పుకొచ్చారు. అయితే హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడం అంటే… అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకున్నంత ఈజీ అన్నట్టు భావించారు. =అది కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ముడిపడిన విషయమే కదా అని లైట్ తీసుకున్నారు. పై స్థాయిలో చాలా వ్యవస్థల ఆమోదం పొందాల్సి ఉంటుందని అస్సలు ముందస్తు ఆలోచన చేయలేకపోయారు. తమకు 151 సీట్లతో అంతులేని మెజార్టీ ఉందని చెప్పి ఎలా చేసినా చెల్లుబాటు అవుతుందని భావించారు. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వ చర్యలను తప్పుపట్టేలా జాతీయ వైద్య కమిషన్ ఒక నిర్ణయాన్ని ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు.
సర్టిఫికెట్లలో మారని పేరు..
యూనివర్సిటీ బోర్డుపై పేరు మార్చినా ఇప్పుడు పత్రాలలో ఆ పేరు మారడం లేదు. సర్టిఫికెట్లలో మార్చడానికి కుదరడం లేదు. ఇటీవల జాతీయ వైద్య కమిషన్ నంద్యాల మెడికల్ కాలేజీలో క్లాసులు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఇలా అనుమతి ఇస్తూ ఆ మెడికల్ కాలేజీ ఏ యూనివర్శిటీ పరిధిలో ఉందో చెప్పింది. ఆ యూనివర్శిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా నే చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పరిధిలో నంద్యాల మెడికల్ కాలేజీ ఉంటుందని.. స్పష్టం చేసింది. దీంతో ఎన్టీఆర్ పేరు మారలేదని తెలుసుకొని అధికార వైసీపీ నేతలు షాక్ కు గురవుతున్నారు. అటు పేరు మారకపోగా.. పేరు మార్చేశామన్న అపవాదును మూటగట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆపరేషన్ సక్సెస్..పేషెంట్ డెడ్..
అయితే ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చడం, పథకాల పేర్లు మార్చడం వంటి వాటితో ఆరితేరిన పాలక పక్షానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చాలా ఈజీగా ఉంటుందని భావించారు. కానీ అందులో చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని వారికి అస్సలు తెలియదు. రెండు, మూడేళ్లయినా పేరు మార్చడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈలోపు ప్రభుత్వం మారితే ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్ అన్నట్టు వైసీపీ నేతల పరిస్థితి మారింది. ఒక వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారితే పేరు మార్పు ఉపసంహరణతో దీనికి స్పష్టమైన పరిష్కార మార్గం దొరుకుతుందని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. సో సంకల్పం బలమైనప్పుడు ఎన్ని అవరోధాలు వచ్చినా ముందుకెళ్లవచ్చు. కానీ చిత్తశుద్ధి లోపం ఉంటే ఇటువంటి వైఫల్యాలే ఎదురుకావచ్చు.