NTR Centenary Celebrations
NTR Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అతిరథ మహారథులు వచ్చారు. కానీ టాలివుడ్ అగ్ర కథనాయకులు ముఖం చాటేయడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నడిబొడ్డున శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఉత్సవ కమిటీతో పాటు బాలక్రిష్ణ అన్నీతానై వ్యవహరించారు. దాదాపు టాలీవుడ్ లోని హీరోలందరికీ ఆహ్వానాలు అందించారు. అయితే అందులో కొందరు మాత్రమే హాజరయ్యారు. కీలక కథనాయకులు రాకపోవడంతో కాస్తా కళ తగ్గింది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీతో జనసేనాని సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. పొత్తులు కూడా ఖరారయ్యాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో పవన్ రాకపోవడం కాస్తా లోటే. సొంత మనవడు జూనియర్ ఎన్టీఆర్ ముఖం చాటేయ్యడంతో ఫ్యాన్స్ హర్టవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం కనిపించలేదు. ఆయన తప్పకుండా హాజరవుతారని వార్తలు వచ్చాయి. కానీ గైర్హాజరయ్యారు. అటు అల్లు అర్జున్ కూడా రాలేదు.
పవన్ రాకపోయినా ఆయన తరుపున రాంచరణ్ హాజరయ్యారు. అటు చిరంజీవి, ఇటు పవన్ లేని లోటును చెర్రీ తీర్చారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అద్భుతమైన స్పీచ్ కూడా ఇచ్చారు. వెండితెరపై అందాల రాముడైనా, కొంటె కృష్ణుడైనా, ఏడుకొండల వాడైనా… ఇలా ఏ పాత్రయినా ఎన్టీఆర్ చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుందన్నారు. అంతేకాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్నారని రామ్ చరణ్ కొనియాడారు. చంద్రబాబు తన పక్కనే చెర్రీని కూర్చోబెట్టడం కూడా సభికులను ఆకర్షించింది.
దగ్గుబాటి కుటుంబం నుంచి వెంకటేష్ హాజరయ్యారు. అల్లు అరవింద్ సైతం వచ్చారు. అటు అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య, సుమంత్ పాల్గొన్నారు. అయితే హాజరైన సినీరంగ ప్రముఖులెవరూ రాజకీయాల జోలికి పోలేదు. కేవలం ఎన్టీఆర్ గొప్పతనంపైనే మాట్లాడారు. విజయవాడలో జరిగిన వేడుకల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రసంగం వివాదాలకు దారితీసిన వేళ.. చంద్రబాబుపై వాఖ్యానాల జోలికి ఎవరూ పోలేదు.
సినీరంగానికి సంబంధించి మురళీమోహన్, ఆర్.నారాయణమూర్తి, హీరో కృష్ణ సోదరుడు, పద్మాలయ స్టూడియోస్ అధినేత జి.ఆదిశేషగిరిరావు, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్, మహా నటి సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి, లోకేశ్వరి, రోజారమణి, జయప్రద, జయసుధ, విజయా విశ్వనాథ్ తదితరులు హాజరైన వారిలో ఉన్నారు. మొత్తానికైతే ఊహించిన స్థాయిలో, ఆహ్వాన పత్రికలు అందుకున్న వారిలో చాలామంది గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.