YS Sharmila: కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం దాదాపుగా అయినట్టే. నేడో, రేపో దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన అందరూ వెలువడుతుందని అందరూ అంటున్నారు. మొన్నటిదాకా ఇదే విషయం మీద బెంగళూరులో ఉండి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో చర్చల మీద చర్చలు నడిపి హైదరాబాద్ వచ్చిన షర్మిల సైలెంట్ అయిపోయారు. ట్విట్టర్లో మాత్రమే ఆమె టైం పాస్ చేస్తున్నారు. కెసిఆర్ కుటుంబం మీద ఎప్పుడో ఒకసారి ట్వీట్ చేస్తున్నారు.
పార్టీ విలీనం సందర్భంగా కాంగ్రెస్ షర్మిల ముందు పెద్ద టాస్క్ విధించిందని ప్రచారం జరుగుతోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేకుండా ఉండేది. ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గణనీయంగా గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కలిగి ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నేల చూపులు చూస్తోంది. జగన్ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో లేచే అవకాశాలు కనిపించడం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు జగన్ వెంట నడుస్తున్నారు.. ఇలాంటి సందర్భంలో పార్టీని కాపాడుకోవాలి అంటే బలమైన శక్తి కావాలి. ఆ శక్తి తమకు షర్మిల రూపంలో లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు షర్మిల ఇష్టపడలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలు రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా షర్మిల తన మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలోని పాలేరు లేదా సికింద్రాబాద్ నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేయాలని షర్మిల అనుకున్నారు. అని అనివార్యంగా కాంగ్రెస్ విధించిన టాస్క్ కు ఒప్పుకోవడంతో ఆమె ఏపీ రాజకీయాల్లోకీ ప్రవేశించేందుకు సిద్ధపడుతున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయవద్దని, కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోతే ఏపీ లోని బాధ్యతలు విషయంలో సమస్యలు వస్తాయని కాంగ్రెస్ పెద్దలు ఆమెకు నచ్చజెప్పారు. ఇదే సమయంలో సూచించిన వారికి అసెంబ్లీ టికెట్లు ఇస్తామని షర్మిలకు హామీ ఇచ్చారు. ఇక ఏపీలో 2024 ఎన్నికల్లో లక్ష్యం ఏమిటో కాంగ్రెస్ పార్టీ షర్మిలకు అర్థమయ్యేలా చెప్పింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా జగన్ వైపు వెళ్లిందని.. 2024 ఎన్నికలలో తిరిగి ఆ ఓటు బ్యాంకు తామవైపు తిప్పు కూడా సాధ్యం కాదని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది. ఫలితంగా 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు అవసరమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీని ద్వారా 2029 ఎన్నికల నాటికి తిరిగి కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుందని వారు లెక్కలు వేసుకుంటున్నారు. దీనికోసం షర్మిలకు పార్టీలో జాతీయస్థాయిలో పదవి ఇవ్వడంతో పాటు ఏపీలో నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ నాయకుల వ్యూహంగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ వ్యూహాలకు పూర్తిగా షర్మిల సహకరిస్తారా? షర్మిల ఏపీలో కాంగ్రెస్ నేతగా ఎంట్రీ ఇస్తే నిజంగా జగన్ ఓటు బ్యాంకు ను టార్గెట్ చేసే స్థాయిలో ప్రభావితం చేయగలరా? అందరూ అనుకున్నట్టు షర్మిల కాంగ్రెస్ విధించిన టాస్క్ పూర్తి చేయగలరా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది