North Korea- Russia: రష్యాకు నార్త్ కొరియా నియంత?..ఇంతకీ “కిమ్” కర్తవ్యం అదేనా?

ఇరుదేశాల అధ్యక్షులు రష్యాలో భేటీ అయినప్పటికీ.. ఎక్కడ సమావేశం అయ్యారనే ప్రాంతాన్ని మాత్రం ఇరుదేశాలు చాలా గోప్యంగా ఉంచాయి. వ్లాది స్వోస్టాక్ లో ఇద్దరూ భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది.

Written By: K.R, Updated On : September 13, 2023 1:08 pm

North Korea- Russia

Follow us on

North Korea- Russia: ఉత్తర కొరియా ప్రస్తుతం తీవ్ర దుర్భిక్ష స్థితిలో ఉంది. ఆర్థికంగా తీవ్రస్థాయిలో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కోవిడ్ కల్లోలం తర్వాత ఆ దేశం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. “ఒక్క పూటే భోజనం చేయండి” అని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ఆహారంపై ఆంక్షలు విధించారు. ఫలితంగా ఉత్తర కొరియాలో అన్న పానీయాలు కూడా కరువైపోయాయి. దీంతో ఆకలి చావులు అధికమైపోయాయి. అటు చూస్తే అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇటు చూస్తే దేశంలో రక్షణ రంగానికి తప్ప మిగతా వాటికి ప్రభుత్వం కేటాయింపులు జరపలేని స్థితిలో ఉంది. ఈ క్రమంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు రష్యా వెళ్లిపోయారు. రష్యా కూడా పలు దేశాలు విధించిన ఆంక్షలతో సతమతమవుతోంది. ఇలాంటప్పుడు అటు పుతిన్, ఇటు కిమ్ భేటీ కావడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

ఇరుదేశాల అధ్యక్షులు రష్యాలో భేటీ అయినప్పటికీ.. ఎక్కడ సమావేశం అయ్యారనే ప్రాంతాన్ని మాత్రం ఇరుదేశాలు చాలా గోప్యంగా ఉంచాయి. వ్లాది స్వోస్టాక్ లో ఇద్దరూ భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే కిమ్ ప్రయాణించే ప్రత్యేక రైలు రష్యా చేరుకున్న తర్వాత రాజ్దోల్నయా నదిని దాటి..ఉసో రిస్క్ మీదుగా వాష్టోగ్ని వైపు సాగుతోంది. కోవిడ్ కల్లోలం ప్రారంభమైనప్పటి నుంచి కిమ్ దేశం విడిచి బయటకు వెళ్లలేదు. అయితే అలాంటి కిమ్ హఠాత్తుగా రష్యా ఎందుకు వెళ్లారు అనేది ఆసక్తికరంగా మారింది. పుతిన్ తో ఎటువంటి చర్చలు జరుపుతారు? అమెరికా నిఘా సంస్థలు చెబుతున్నట్టుగా ఇరుదేశాల అధినేతలు ఆయుధాల డీల్ కుదుర్చుకుంటారా? ఉక్రెయిన్ పై దురాక్రమతో అంతర్జాతీయ సమాజం.. ముఖ్యంగా అమెరికా నుంచి వెలిని రష్యా ఎదుర్కొంటోంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తే రష్యా మరింత ఒంటరి అవుతుంది.

ప్రపంచ వ్యవహారాల నిపుణుల ప్రకారం ఆయుధాల బేహారీగా రష్యాకు పేరుంది ఉక్రెయిన్ పై దురాక్రమణ తర్వాత తన అమ్ముల పొదిలో ఉన్న క్షిపణులను రష్యా ఎడాపెడా వాడేసింది. ఏడాదిన్నర గడిచిపోయినప్పటికీ యుద్ధం ఒక కొలిక్కి రాలేదు. పైగా అమెరికా అండతో ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగుతోంది. ఈ యుద్ధం వల్ల రష్యా పదివేలకు పైగా యుద్ద ట్యాంకులు, ఆర్టిలరీ వ్యవస్థలను కోల్పోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇప్పుడు యుద్ధాన్ని కనుక కొనసాగించాలి అనుకుంటే రష్యా వద్ద ఆయుధాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఆయుధాల కొనుగోలు కోసం పుతిన్ ఎదురుచూస్తున్నట్టు అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు..

ఇక కిమ్_2 హయాంలో ఉత్తరకొరియాలో అను పరీక్షలు జరపడంతో 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఆ దేశం పై ఆంక్షలు విధించింది. భద్రత మండల లో జరిగిన తీర్మానానికి అప్పట్లో రష్యా కూడా మద్దతు ఇచ్చింది. అయితే ఆంక్షలు కొనసాగుతున్న దేశాలతో ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఎలాంటి ఆయుధాలు కొనుగోలు చేయకూడదని నిబంధన ఉంది. అప్పట్లో ఐక్యరాజ్యసమితి ఆంక్షలు మద్దతు ఇచ్చిన రష్యా.. ఇప్పుడు ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తుందా అనే ఉత్కంఠతో ప్రపంచ దేశాలు కిమ్_ పుతిన్ భేటీ పై సర్వత్రా ఆసక్తిగా ఉన్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధం తర్వాత క్రమంగా ఆంక్షలు ఛట్రంలో ఇరుక్కుంటూ భద్రతామండలిలో అధ్యక్ష స్థానంలో మిత్ర దేశాలు ఉన్న సమయంలో విటో తో గట్టెక్కుతున్న రష్యా.. అన్నింటికీ తెగిస్తుందనడంలో అనుమానం లేదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయుధాల డీల్ కిమ్_ పుతిన్ భేటీ అవుతున్నారని తెలుస్తోంది. ఆయుధాలు, ఆయుధ తయారీ పరిశ్రమలతో ముడిపడి ఉన్న అధికారులే కిమ్ వెంట రష్యా వెళ్లడంతో ఆయుధాల డీల్ అనే విషయం స్పష్టమవుతోంది.