
భారతీయ జనతా పార్టీలో కీలక పోస్టు దక్కాలంటే ఎంతో శ్రమించాలి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి ఉండాలి. అలా అయితే అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న కీలక నేతలంతా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్లో ఉన్నవాళ్లే. అయితే అలాంటి నేపథ్యం లేకున్నా.. కేవలం పార్టీలో చేరిన ఆరేళ్లకే బీజేపీ తరుపున ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నేత గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరగుతోంది. ఇటీవల అసోం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన హిమంత బిశ్వా శర్మ అనతి కాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు. అయితే ఆయనకు ఇంత స్పీడుగా ముఖ్యమంత్రిగా ఎదగడానికి కారణం ఏంటి..?
వాస్తవానికి హిమంత బిశ్వా శర్మ 1990 నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్నా తగిన ప్రాధాన్యత లేదని ఎన్నోసార్లు మదనపడ్డారు. దీంతో ఆయన 2005 సంవత్సరంలో తరుణ్ గోగోయ్ ప్రభుత్వం నుంచి వైదొలిగారు. ఆ తరువాత బీజేపీ కండువా కప్పుకొని పార్టీ కోసం పనిచేశారు. అయితే హిమంత ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పట్టు సాధించడానికి కారణమయ్యాడు. తన వ్యూహంతో పాటు కష్టపడేతత్వంతో పలు రాష్ట్రాల్లో అధికారంలో రావడానికి కారణమయ్యారు.
ఇక అసోం రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రావడానికి ఎంతో కృషి చేశారు. అయితే ఆయన గోల్ అంతా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని. అందుకోసం తీవ్రంగా శ్రమించాడు. ప్రతీ కార్యకర్తతో పని చేయించుకుంటూ పార్టీని బలోపేతం చేశారు. మొత్తానికి ఆయన అనుకున్న కల నెరవేరింది. ఇటీవల ఆయన అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీలో చేరి ఇంత తక్కువ కాలంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే ఎలాంటి ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకుండా హిమంత్ బిశ్వా శర్మ సీఎం అవడంపై చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం పనిచేసేవాళ్లెవరైనా వారికి అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన హిమంత్ అసోం ను ఏ రకంగా అభివృద్ధి చేస్తాడో చూడాలని చర్చించుకుంటున్నారు.