
నిన్నటి వరకూ పెద్ద తిరుపతి దేవస్థానం భూముల అమ్మకం వివాదంలో వార్తల్లోకి ఎక్కగా, నేడు చిన్న తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన ద్వారకా తిరుమల దేవస్థానం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారి వార్తల్లోకి ఎక్కింది. ఇందులోనూ స్థానిక అధికార పార్టీ నాయకులు ఉండటం విశేషం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొండపై అసాంఘిక కార్యకలాపాలు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా నిభందనల కారణంగా శ్రీవారి కొండపైకి అధికారులకు తప్ప భక్తులకు, ఇతరులు ఎవరికి ప్రవేశం లేదు. అయితే కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు కొండపైన అతిధి గృహాన్ని కేటాయించిన విషయం చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల 2వ తేదీన ద్వారకా తిరుమల మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులు కొందరు పవిత్రమైన శ్రీవారి కొండపైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాత్రి 10.30 గంటల సమయంలో కొండపైకి వైసీపీ నాయకులతోపాటు, ఒక ప్రముఖ పత్రిక విలేకరి, మరో ప్రవేటు ఉద్యోగి, ఇరువురు మహిళలు ఉన్నారు. ఆ రాత్రి వారు అతిథి గృహంలో మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ కార్యనిర్వాణాధికారి రావిపాటి ప్రభాకర రావు ఈ విషయాన్ని అంగీకరించారు. 2వ తేదీ రాత్రి కొండపైకి వాహనం వెళ్లిన మాట వాస్తవమేనని చెప్పారు. ఒక వ్యక్తి వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి బాద్యులైన సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.