
ఎల్.జి దుర్ఘటన జరిగిన రోజు తాను సీఎం జగన్ తోపాటు విశాఖపట్నం వచ్చేందుకు హెలికాప్టర్ లో సీటు లేకపోవడమే కారణమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎల్.జి సంఘటన దృష్ట్యా ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడకు వస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో తాను దిగి, మంత్రిని ఇక్కడకు పంపించడం జరిగిందని స్పష్టం చేశారు. దానిని అనవసరంగా రాధ్దాంతం చేస్తున్నారు. అది బహుశా ప్రతిపక్షాలకు, ఎల్లోమీడియాకే చెల్లుతుందని చెప్పుకొచ్చారు. విశాఖ
తాను అడాప్ట్ చేసుకున్న జిల్లా అని, ఇక్కడ క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా ఉంటానని, దీని అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడతానని చెప్పారు.
బాధిత గ్రామాల్లో ప్రజలు చాలా వరకూ వచ్చేశారని, ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారు బహుశా ఈరోజు డిశ్చార్జ్ కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనవసరంగా ఆరోపణలు చేసేదానికన్నా ప్రత్యేకంగా పలానా వారు వెళ్లిపోయారని చెబితే బాగుంటుందని పేర్కొన్నారు. సాధారణంగా ఇక్కడనుంచి వేరే ఊర్లకు కొంతమంది వెళ్తుంటారు, వస్తుంటారని చెప్పారు. ఏదో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ తీసుకుని దానిని ఎక్స్ పోజ్ చేసి ఇక్కడనుంచి ప్రజలు వెళ్లిపోతున్నారనే భావన కల్పించడం మంచిది కాదని, ఎల్లోమీడియా దానిని అర్ధం చేసుకోవాలని కోరారు. గ్రామాలలో పశువులకు అవసరమైన పశుగ్రాసం కూడ సరఫరా చేస్తామన్నారు. ప్రమాదం బారిన పడిన గ్రామాలలో సాధారణ స్ధితి వచ్చిందని, ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.