
దేశంలో కోవిద్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం రాజ్యాంగ విరుద్ధం అని హైదరాబాద్ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా ప్రజలందరినీ ఇళ్ళకే పరిమితం చేసి కరోనాని కట్టడి చేయడం నాయకత్వ లేమికి నిదర్శనమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల నిరోధక చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం చట్ట విరుద్ధమే కాక సమాఖ్య విధానానికి కూడా వ్యతిరేకం అన్నారు.
లాక్ డౌన్ అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , కార్మికులు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలంతా ఇంట్లోనే క్షేమంగా ఉండాలని కోరారు. క్వారంటైన్ మన మంచికే అని దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.