
రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి తరలించే అంశంపై ప్రభుత్వం దూకుడుగానే అడుగులు వేస్తోంది. మూడు రాజధానుల బిల్లు శాసన మండలిలో అర్దాంతరంగా నిలిచి పోయినప్పటికీ వెనక్కి తగ్గేది లేదంటూ విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు పూనుకుంటోంది. ఒక పక్క కోర్టులో తీర్పు వచ్చే వరకు తరలించేది లేదంటూనే కీలకమైన సీఎం, అనుబంధ కార్యాలయాలకు సంబంధించిన ఫర్నిచర్ ను విశాఖకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలు చేయడం, రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత తదితర అంశాలపై రాజకీయ వేడి సాగుతున్న వేళ ప్రభుత్వం మాత్రం తాము అనుకున్న పనిని చేసుకెళ్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా ఈ నెల 10వ తేదీన విశాఖ విజ్ఞాన్ కళాశాల సమీపంలో ఉన్న గ్రేహౌండ్స్ ప్రాంగణంలో ఉన్న భవనాలను కార్యాలయాలుగా ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా సచివాలయంలోని ఫర్నిచర్ ను ప్రభుత్వం తరలించిదనే వార్తలు వస్తున్నాయి. ఈ అంశం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది పూర్తి చేసే వరకూ వెనక్కి తగ్గరు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటూ వెళతారు. రాజధాని విషయంలోనూ ఇదే చేస్తున్నారు. రాజధాని తరలింపు బిల్లును సెలెక్ట్ కమీటీకి పంపాలని నిర్ణయం తీసుకున్న పాపానికి తెల్లారేసరికి శాసనమండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఇటువంటి కఠిన నిర్ణయాలు ఆయన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి.
ఈ నెల 28వ తేదీ నుంచి విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా పాలన ప్రారంభించడానికి జగన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కొద్ధి రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. రాజధాని తరలిపును ఆపడం ఎవరి వల్లా కాదని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ముఖ్యమంత్రి గా ఏడాది కాలం పూర్తయ్యేలోగా విశాఖ నుంచి పాలన ప్రారంభించే ఆలోచనతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రభుత్వం ఈ విషయంలో హైకోర్టుకు చెబుతున్న వివరాలకు పొంతన లేకుండా ఉంది. మూడు రాజధానుల బిల్లు పాస్ అయ్యే వరకూ రాజధానిని తరలించమని చెబుతూనే… మరోవైపు విశాఖలో రాజధాని ఏర్పాటుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయడం ప్రభుత్వం ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది.