టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ అంటే ప్రయాణికులకు దడలే. ఒక్కోసారి గంటల తరబడి వేయిట్ చేయాల్సి వస్తుంది. ఇక ఫెస్టివల్ రోజుల్లో అయితే రోజుల తరబడి నిరీక్షించాలి. అయితే ఈ బాధను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రయాణికులు తమ వాహనాల టోల్ ఛార్జీలను ముందుగానే చెల్లించి ఓ స్టిక్కర్ ను తమ వాహనానికి వేసుకోవాలి. దీంతో టోల్ గేట్ల వద్ద గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన పనిలేదు. అయితే ఫాస్టాగ్ విధానం అమలు చేస్తున్నా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. దీంతో ఎన్ హెచ్ ఏఐ( జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.
టోల్ గేట్ల వద్ద 10 సెకన్లకు మింగి వాహనం వేచి ఉండడానికి వీల్లేదని, అందుకు నిర్వాహకులు వాహనాల క్లియర్ కు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇక టోల్ గేట్ల వద్ద వరుసగా వందమీటర్లకు మించి వాహనాలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ తగ్గింది. అయితే 96 శాతం టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ ను వినియోగిస్తున్నారు. . కొన్నిచోట్ల 99 శాతం యూజ్ చేస్తున్నారు. అయితే ఎలక్ట్రానిక్ టోల్ గేట్ల వచ్చిన దృష్ట్యా టోల్ గేట్ల వద్ద రద్దీ మరింత తగ్గించేందుకు డిజైన్లలో మార్పులు చేయాలని ఎన్ హెచ్ ఏఐ నిర్ణయించింది.
ఇందులో భాగంగా అన్ని టోల్ గేట్ల వద్ద వంద మీటర్ల దూరంలో ఓ పసుపు గీతను గీయనున్నారు. వాహనాలు ఆ లైన్ దాటి వెళ్లి ఆగితే ముందున్న వాహనాలను వేగంగా పంపించేందుకు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ముందున్న వాహనాలను టోల్ లేకుండా వదిలేయాలి. మిగతా వాహనాలను పసుపు గీత లైన్ లోపన ఉండే విధంగా చూసుకోవాలి. గత జనవరి నుంచి వంద శాతం ఫాస్టాగ్ అమల్లోకి వచ్చింది.
అయితే ట్రాఫిక్ రద్దీ ఇంకా తగ్గని నేపథ్యంలో ఇలాంటి మార్పులు చేశారు. కొన్ని చోట్ల వంద మీటర్లకు మించి వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఫాస్టాగ్ అమల్లోకి వచ్చినా ట్రాఫిక్ నియంత్రించాలని మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ విధానంతో టోల్ ప్లాజా సిబ్బందిలో జవాబుదారీతనం పెరుగుతోందని, దీంతో సమస్యలు ఉండవని ఎన్ హెచ్ ఏఐ ఉత్తర్వుల్లో తెలిపింది.