Kavitha : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తున్న అంశాల్లో కల్వకుంట్ల కవిత విషయం కూడా ఉంది. రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన ఆమె.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి ప్రాభవం కోల్పోతూ వచ్చారనే చెప్పాలి. జాగృతి కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. బయట పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. అయితే.. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ. అయినా కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం.

బతుకమ్మ ఉత్సవాలు రెండు రోజుల కింద ముగిశాయి. ఒకప్పుడు తెలంగాణలో బతుకమ్మ అంటే.. కవితే చేయాలి అన్నట్టుగా ఉండేది పరిస్థితి. టీవీల్లో, పేపర్లలో విపరీతమైన కవరేజ్ ఉండేది. కానీ.. ఇప్పుడు ఆమె పేరు ఎక్కడా వినిపించట్లేదు. ఫొటో కనిపించట్లేదు. ఎక్కడోకాదు.. అధికార పార్టీకి అనుకూల పత్రికగా చెప్పుకునే దినపత్రికలోనూ ఆమెకు కవరేజ్ లేకపోవడం గులాబీ శ్రేణులను సైతం విస్మయ పరుస్తోంది.
దీనికి కారణం ఏంటి అన్నప్పుడు.. అన్న కేటీఆర్ తో విభేదాలు ఉన్నయనే చర్చ సాగుతోంది. ఈ కారణంగానే ఆమెకు ప్రయారిటీ తగ్గించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్న రాఖీ పండుగరోజున కవిత ఇక్కడ లేరు. అమెరికా నుంచి ట్విటర్ ద్వారా అన్నకు గ్రీటింగ్స్ చెప్పారు. కేటీఆర్ స్పందించలేదు కూడా.. ఇవన్నీ వీరిమధ్య గ్యాప్ ను సూచిస్తున్నాయని అంటున్నారు.
విపక్ష నేతలు ఇదే విషయాన్ని చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. కానీ.. అదో రాజకీయ వ్యాఖ్యగానే తీసుకున్నారు చాలా మంది. అయితే.. ఇప్పుడు బతుకమ్మ వేళ కూడా గులాబీ అనుకూల పత్రికగా చెప్పే పేపర్లోనూ ఆమెకు పెద్దగా కవరేజ్ ఇవ్వకపోవడంతో ఏం జరుగుతోంది? అని చర్చించుకుంటున్నారు.