Homeఆంధ్రప్రదేశ్‌సమస్యలపై నో ఫైట్: రఘురామ కోసమే పార్లమెంట్ లో వైసీపీ ఫైట్?

సమస్యలపై నో ఫైట్: రఘురామ కోసమే పార్లమెంట్ లో వైసీపీ ఫైట్?

ప్రజాసమస్యలపై పార్లమెంట్ లో గళమెత్తే రోజులు పోయాయి.. తమ స్వార్ధ రాజకీయాలకు పార్లమెంట్ ను వేదికగా వాడుకునే రోజులు వచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమ్యూనిస్టుల కాలంలో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై రోడ్ల మీద.. అసెంబ్లీలో పెద్ద ఎత్తున  కొట్లాడేవారు. కానీ ఎప్పుడైతే అలిగేషన్స్ ఉన్న నేతలు రాజకీయాల్లోకి వచ్చారో.. వారి స్వార్థం కోసం ఇప్పుడు ప్రజాసమస్యలు పక్కకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. తమ వ్యక్తిగత అజెండా ముందుకు తీసుకువస్తున్నారు.

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఎంపీలంతా మూకుమ్మడిగా ఎంపీ రఘురామపై వేటు వేసేందుకు పార్లమెంట్ ను స్తంభింప చేస్తామన్న ప్రకటన నవ్వుల పాలు చేస్తోందన్న విమర్శ వినిపిస్తోంది.

ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ‘ఎన్నిసార్లు లోక్ సభ స్పీకర్ ను కలిసినా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయడం లేదని.. తమ పార్టీ పరువు తీస్తున్న రఘురామపై వేటు వేసేదాకా పార్లమెంట్ ను స్తంభింపచేస్తాం’ అని సంచలన ప్రకటన చేశారు. అనర్హత పిటీషన్ పై నిర్ణయం తీసుకునేదాకా విశ్రమించలేది లేదన్నారు.

అయితే ఇక్కడే ఏపీ ప్రజలు, నెటిజన్లు, విశ్లేషకులు కూడా విజయసాయిరెడ్డి  వ్యాఖ్యలను ట్రోల్స్ చేస్తున్నారు. వైసీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక వ్యక్తి కోసం దేశ పార్లమెంట్ ను స్తంభింపచేయడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏపీ సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటిని పక్కనపెట్టి కేవలం వైసీపీకి కంటగింపుగా మారిన వ్యక్తి పై ప్రతీకారం కోసం అత్యున్నత చట్టసభను అవమానిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం, వ్యవస్థలు ఎన్నో సార్లు శీతకన్ను వేశాయి. ఇప్పటికీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘ప్రత్యేక హోదాను’ కేంద్రప్రభుత్వం ఇవ్వలేదు. నాడు చంద్రబాబు బయటకు వచ్చినా.. నేడు జగన్ బయట నుంచి మద్దతు ఇస్తున్నా కూడా కేంద్రం కరగడం లేదు. ఏపీ సమస్యలు తీర్చడం లేదు. విన్నపాలు బుట్టదాఖలవుతున్నాయి.

-ఇక విభజన చట్టంలో హామీనిచ్చిన విశాఖకు ‘రైల్వే జోన్’ అనేది ఇప్పటికీ నెరవేరలేదు. కేంద్రం అసలు ఈ హామీనే పట్టించుకున్న పాపాన పోవడం లేదు. జగన్ కానీ, ఎంపీలు కానీ ఈ విషయంలో పార్లమెంట్ లో గొంతెత్తిన పాపాన పోలేదు.

-పోలవరం నిధులకు కొర్రీలు వేస్తూ.. తగ్గించి ఇస్తున్నా కూడా జగన్ సర్కార్ నోరు మెదిపిన దాఖలాలు లేవు. కేవలం లేఖలు రాసి ఊరుకోవడం తప్ప పోలవరం పూర్తికి కావాల్సిన నిధులు, ఇతర అవసరాలను కేంద్రం నుంచి తీసుకోవడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమవుతోంది.

– కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు కోసం కేంద్రం హామీ ఇచ్చింది. దానిపై ఇప్పటికీ ముందడుగు పడలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారి తరుఫున కనీసం వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో గళం ఎత్తడం లేదు..స్తంభింపచేయడం లేదు.

-ఇక తాజా జల వివాదంలోనూ వైసీపీ ఎంపీలు, సీఎం జగన్ నోరు మెదపడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జల వివాదంతో ఇరుకునపెడుతున్నా.. విద్యుత్ ఉత్పత్తి పేరిట వందల టీఎంసీలను వృథా చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం లేఖలతో కేంద్రానికి తెలియజేస్తూ మమ అనిపిస్తోంది. దీనిపై గట్టిగా నిలదీయడం లేదు. ఏపీకి సాగు, తాగునీరు అందించే ఈ కీలకమైన ప్రాజెక్టుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఇలా ఏపీని చుట్టుముట్టి పరిష్కారం కానీ ఎన్నో సమస్యలున్నాయి. కానీ వాటిపై పార్లమెంట్ లో మన 23 మంది వైసీపీ ఎంపీలు నోరు మెదపరు..కేంద్రాన్ని నిలదీయరు.. పార్లమెంట్ ను స్తంభింపచేయరు. కానీ తమ వ్యక్తిగత ప్రతిష్టను మంటగలుపుతున్నాడని.. రఘురామపై వేటు వేసేందుకు స్పీకర్ ను పదుల సంఖ్యలో కలుస్తారు? ఆయన నో అంటే పార్లమెంట్ ను స్తంభింపచేస్తారు? ఇదెక్కడి న్యాయం అని సగటు ఏపీ ప్రజలుప్రశ్నిస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన ఎంపీలు ఇలా వ్యక్తిగత అజెండాతో పనిచేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత ఎజెండాను పక్కనపెట్టి ప్రజా అవసరాలు, కేంద్రం నిర్లక్ష్యంపై పార్లమెంట్ ను స్తంభింపచేయాలని హితవు పలుకుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular