Chandrababu Jail: చంద్రబాబుకు మిశ్రమ ఊరట. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విజయవాడ ఏసిబి కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వలేదు. హౌస్ అరెస్ట్ గా పరిగణించాలని కోరినా ఫలితం లేకపోయింది. ఈ తరుణంలో హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ ను ఈనెల 19న విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో బెయిల్ పై పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయాయి. టిడిపి శ్రేణుల్లో నిరాశ అలముకుంది. అయితే మరో కేసులో మాత్రం చంద్రబాబుకు ఉపశమనం లభించింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో ఉండగానే.. సిఐడి మరో కేసు ఫైల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబును ఏ 1 ముద్దాయిగా చూపుతూ.. సిఐడి 5 రోజులు పాటు కస్టడీని కోరింది. దీనికి హైకోర్టు అడ్డు చెప్పింది. ఈనెల 18 వరకు కస్టడీకి తీసుకోవద్దని.. విచారణ సైతం చేపట్టవద్దని సిఐడి కి స్పష్టం చేసింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన కొనసాగిస్తున్నాయి. చంద్రబాబుకు తప్పకుండా బెయిల్ లభిస్తుందని ఆశలు పెట్టుకున్నాయి. కానీ హైకోర్టు విచారణను 19కి వాయిదా వేయడంతో నిరాశకు గురయ్యారు. అయితే ఐదు రోజుల కస్టడీపై స్టే ఇచ్చిన నేపథ్యంలో… 19న చంద్రబాబుకు తప్పకుండా బెయిల్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటు కేసు నమోదు తో పాటు సెక్షన్ల విధింపులో నిబంధనలు పాటించడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో… చంద్రబాబు సురక్షితంగా బయటపడతారని టిడిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే గత నాలుగు రోజుల పరిణామాలలో.. చంద్రబాబుకు కాస్త ఊరట లభించింది.