Huzurabad: హుజురాబాద్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇక్కడ నామినేషన్లు వేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కూడా అక్కడి పసుపు రైతులు చాలా మంది పోటీలో నిలిచి కేసీఆర్ కూతురు కవిత ఓటమికి కారకులయ్యారు. అదే పద్ధతిని హుజురాబాద్ లో కూడా కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నిరుద్యోగులైన చాలా మంది పోటీలో ఉంటారని సమాచారం. వీరందరికి వైఎస్సార్ టీపీ సహకరిస్తుందని చెబుతున్నారు.

నిరుద్యోగులు దాదాపు 200 మంది ఇక్కడ పోటీలో ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే వెయ్యి మంది క్షేత్ర సహాయకులు సైతం పోటీలో ఉండేందుకు సిద్ధమని ప్రకటించడంతో ఇక్కడ కొత్త చరిత్రకు కేంద్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చడం లేదనే కారణంతో ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వంపై పోరాటానికి సంసిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో హుజురాబాద్ లో రసవత్తర రాజకీయానికి తెర లేవనుంది.
నామినేషన్ దాఖలుకు ప్రతి అభ్యర్థి రూ.10 వేలు ధరవావత్ చెల్లించాల్సి ఉంటుంది. అతడికి మద్దతునిస్తూ పది మంది సంతకాలు చేయాల్సి ఉంది. ఈ నిబంధనల ప్రకారం ఎంత మంది బరిలో ఉంటారో తేలనుంది. అభ్యర్థులు మాత్రం ఎక్కువ సంఖ్యలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై ఉన్న కోపంతోనే చాలా మంది పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల్లో హుజురాబాద్ మరింత సంచలనం సృష్టించే వీలు ఉన్నట్లు కనిపిస్తోంది.
నామినేషన్లు పెద్ద మొత్తంలో దాఖలైతే హుజురాబాద్ మరో చరిత్ర కానుంది. ఇప్పటి వరకు అధికార పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాత్రమే నామినేషన్ వేశారు. ఇంకా ఎవరు కూడా వేయలేదు. టీఆర్ఎస్ మాత్రం తక్కువ మంది పోటీలో ఉండేలా చూసుకుంటోంది. కానీ ఎక్కువ మంది పోటీలో ఉంటారని తెలుస్తోంది. దీంతో హుజురాబాద్ లో రాజకీయం మరింత వేడక్కే సూచనలు కనిపిస్తున్నాయి.