Homeజాతీయ వార్తలుNitish Kumar: ఇండియా కూటమి సారథిగా నితీష్ కుమార్?

Nitish Kumar: ఇండియా కూటమి సారథిగా నితీష్ కుమార్?

Nitish Kumar: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్తోంది. అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. అయితే రాజస్థాన్,చత్తీస్గడ్, మధ్యప్రదేశ్ లో కమలదళం హవా నడుస్తోంది. ఆ మూడు రాష్ట్రాలు బిజెపి గెలిచే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. కూటమి నాయకత్వ బాధ్యతలను మార్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఇండియా కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ బాధిత పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిని రద్దు చేసుకొని.. ఇండియా కూటమిగా అవతరించాయి. అయితే ఈ కూటమి నాయకత్వ విషయంలో భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా మమతా బెనర్జీ, నితీష్ కుమార్ కూటమి నాయకత్వ బాధ్యతలు తమకు అప్పగించాలని కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అతి పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ తమకే నాయకత్వం ఉండాలని కోరుతూ వస్తోంది.

సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో స్థానాలు దక్కించుకోలేదు. ఒక్క తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఇండియా కూటమి బాధ్యతలను వేరొకరికి అప్పగించాలన్న డిమాండ్ భాగస్వామ్య పక్షాల నుంచి వినిపిస్తోంది.ప్రధానంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఇండియా కూటమి కన్వీనర్ గా ఎన్నుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అటు మమతా బెనర్జీ తో పాటు అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు నాయకత్వ బాధ్యతలను ఆశిస్తున్నారు. అయితే నితీష్ కుమార్ అయితేనే కూటమి నాయకత్వ బాధ్యతకు సరిపోతారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బిజెపిని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. ఐదు రాష్ట్రాల ఫలితాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణ పై చర్చించేందుకు కూటమిలోని పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ఢిల్లీకి రావాలని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే ఆహ్వానించినట్లు సమాచారం. ఇది కూటమి బాధ్యతలను నితీష్ కుమార్ కు అప్పగించేందుకేనని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ వ్యతిరేక ఫలితాలు వచ్చిన తరుణంలో ఈ భేటీ నిర్వహిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇండియా కూటమి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular