Nitin Nabin BJP President: కేంద్రంలో దశాబ్దానికిపైగా అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి దశాబ్ద కాలం తర్వాత కొత్త అధ్యక్షుడు వచ్చాడు. ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా పదవీకాలం రెండు పార్యాయాలు పొడిగించారు. మూడోసారి పొడగింపు లేకుండా బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది పరీక్షల తర్వాత నూతన అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం(జనవరి 20న) బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. జేపీ.నడ్డా నుంచి బాధ్యతలు ఇవ్వగా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొన్నారు.
పార్టీ స్వభావం, భవిష్యత్ లక్ష్యాలు
ప్రధాని మోదీ ప్రసంగంలో బీజేపీలో సామాన్య స్వయంసేవకుడు కూడా అధ్యక్షుడు కావచ్చని ఉద్ఘాటించారు. ‘నేను ఒక సాధారణ కార్యకర్త, నితిన్ నా నాయకుడు‘ అంటూ పార్టీలో ప్రజాస్వామ్యం, దేశసేవా భావనను ప్రతిపాదించారు. ప్రభుత్వ పదవులు ఉన్నా పార్టీ కార్యకర్తగా గర్వపడుతున్నానని చెప్పారు. అంతేకాకుండా, కుటుంబ రాజకీయాలు యువతకు అవకాశాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. లక్షలాది మంది యువులను నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. పార్టీ అందరి కోసం పనిచేస్తూ, విమర్శకులైన అర్బన్ నక్సల్‌ల ప్రభావాన్ని ఎదిరించాలని సూచించారు. కాంగ్రెస్‌లోని కుటుంబాధిపత్యం పతనానికి కారణమని, ఆ పాఠాలు మనకు జాగ్రత్తలుగా ఉండాలని హెచ్చరించారు.
నబీన్ రాజకీయ ప్రయాణం..
45 ఏళ్ల వయసులో లోకంలో అతిపెద్ద పార్టీ అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించిన నితిన్ నబీన్ 1980లో రాంచీలో జన్మించారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో ముడిపడిన కుటుంబం నుంచి వచ్చిన ఆయన, యువమోర్చా ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తండ్రి పట్నా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉండగా 2006లో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో 60 వేల మెజారిటీతో గెలిచిన నితిన్.. తర్వాత ఐదుసార్లు ఎమ్మెల్యేగా నిలిచారు. 2023 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో పార్టీ సహ ఇన్‌చార్జ్‌గా విజయం సాధించి, తర్వాత లోక్‌సభలో 11లో 10 సీట్లలో బీజేపీని గెలిపించారు. డిసెంబర్ 16న తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులైన ఆయనకు ఇప్పుడు లాంఛన పదవి లభించింది. భార్య దీపా మాలా శ్రీవాస్తవ్‌తోపాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రెండో తరం నాయకత్వం..
జాతీయ స్థాయిలో అంతకు ముందు ప్రముఖంగా లేని నబీన్ ఎన్నిక పార్టీలో యువ తరం పాలిటిక్స్‌కు సంకేతం. పాలన, సంఘటనా నైపుణ్యాల్లో పరిణతి సాధించిన ఆయనకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన భారీ బాధ్యత కొత్త అధ్యక్షుడిపై ఉంది.
