https://oktelugu.com/

పదవి పోయినా జగన్ ను వదలనంటున్న నిమ్మగడ్డ

ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోరనేది వాస్తవం. ఎందుకంటే.. ఎన్నికల కోసం అటు ఎస్‌ఈసీ.. ఇటు ప్రభుత్వం పడిన కొట్లాట అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వం ఓ వైపు ఎన్నికలు వద్దని వారిస్తున్నా.. హైకోర్టు వరకూ వెళ్లినా నిమ్మగడ్డ మాత్రం తన పంథాను మార్చుకోలేదు. అంతేకాదు.. తన హయాంలోనే ఎన్నికలు జరిపించాలని పట్టుదలతో ఉండిపోయారు. అనుకున్నట్లుగానే ఆయన ప్రభుత్వంపై పైచేయి సాధించారు. ప్రభుత్వం ఎన్నికలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 31, 2021 / 11:31 AM IST
    Follow us on


    ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోరనేది వాస్తవం. ఎందుకంటే.. ఎన్నికల కోసం అటు ఎస్‌ఈసీ.. ఇటు ప్రభుత్వం పడిన కొట్లాట అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వం ఓ వైపు ఎన్నికలు వద్దని వారిస్తున్నా.. హైకోర్టు వరకూ వెళ్లినా నిమ్మగడ్డ మాత్రం తన పంథాను మార్చుకోలేదు. అంతేకాదు.. తన హయాంలోనే ఎన్నికలు జరిపించాలని పట్టుదలతో ఉండిపోయారు. అనుకున్నట్లుగానే ఆయన ప్రభుత్వంపై పైచేయి సాధించారు.

    ప్రభుత్వం ఎన్నికలు వద్దంటూ హైకోర్టుకు వెళ్లినా అక్కడా నిమ్మగడ్డకు సానుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఇక ఆయన ఎక్కడా ఆగలేదు. వెంటవెంటనే ఎన్నికలకు నోటిఫికేషన్లు ఇచ్చేశారు. ముందుగా పంచాయతీ ఎన్నికలు జరిపించారు. ఏకగ్రీవాలను వ్యతిరేకించారు. దానిపైనా ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో.. ఎస్‌ఈసీపై మొట్టికాయలు వేసింది. ఇక తప్పదనుకుని చివరకు వారికి ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీని కట్టడి చేసేందుక శతవిధాలా ప్రయత్నించారని ఆ పార్టీ నేతల ఆరోపణ కూడా. ఇబ్బందులు కూడా పెట్టారని అంటుంటారు. సరే.. ఏది ఏమైనా చివరకు ఆ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులే మెజార్టీ స్థానాలను దక్కించుకోగలిగారు.

    ఇక తదుపరి మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు నిమ్మగడ్డ. ఆ ఎన్నికల్లోనూ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు పన్నాయి. ఈ కుట్రలకు ఎస్‌ఈసీ కూడా సపోర్టుగా నిలిచారని అధికార పార్టీ వాదన. చివరకు ఈ ఎన్నికల్లోనూ వైసీపీ హవానే నడిచింది. ఇక ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న నిమ్మగడ్డ.. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ పదవి పోయినా న్యాయం పోరాటం తప్పదంటూ హెచ్చరించారు.

    ఎస్‌ఈసీ కార్యాలయంలో నిమ్మగడ్డ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని.. ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందని అన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలు, హైకోర్టు వ్యాఖ్యలు, కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా ఎస్‌ఈసీ గుర్తు చేసుకున్నారు. ‘తెలంగాణలో నాకున్న ఓటు హక్కుని రద్దు చేసుకొని ఏపీలోని మా సొంత గ్రామంలో ఓటరుగా చేరాలని దరఖాస్తు చేసుకున్నా. అది స్థానికంగా ఉండే ఎలక్ర్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, జిల్లా అధికారి పరిధిలో ఉండే అంశం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కానే కాదు. నా అప్పీలు జిల్లా కలెక్టర్‌‌ వద్ద పెండింగ్‌లో ఉంది. దీన్ని టీ కప్పులో తుఫాను మాదిరిగా సృష్టించారు. ఓటు హక్కు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. దీనికి వేరే కారణాలు ఉన్నాయని అనుకోవడం.. ఇవన్నీ అపోహలకు దారితీస్తుంటాయి’ అని చెప్పుకొచ్చారు.

    ‘వ్యవస్థల మధ్య అంతరాన్ని పెంచుతుంటాయి. ఇలాంటివి ఎప్పుడూ కోరుకోవడం లేదు. కోరుకోను కూడా. నేను పదవిలో ఉన్నంత కాలం ఇలాంటి వ్యక్తిగత విషయాలు పట్టించుకోలేదు. పక్కన పెట్టా. పదవీ విరమణ తర్వాత ఒక పౌరుడిగా నా హక్కు సాధించుకోవడానికి వెనుకాడను. అవసరమైతే హైకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తా. దేశంలో ఒక వ్యక్తికి ఎక్కడైనా ఒక చోట ఓటు వేసే హక్కు ఉంటుంది. ఏ వ్యక్తికైనా ఓటు హక్కు కల్పించనని కలెక్టర్‌‌ గానీ.. ఏ వ్యవస్థ అయినా అనగలుగుతుందా..? రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ కాదనడానికి వీల్లేదు’అంటూ ఉద్ఘాటించారు. మొత్తంగా చూస్తే నిమ్మగడ్డ మాటల్లో తన పదవీ పోయినా కూడా జగన్‌పై పోరాటం తప్పదని స్పష్టం చేసినట్లుగా అర్థం అవుతోంది.