Political Parties: కొంగొత్త ఆశలతో కొత్త ఏడాది ప్రారంభమైంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఈ ఏడాది కీలకం. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అన్ని పార్టీలకు అత్యంత ప్రాధాన్యమైన ఏడాది ఇది. ఒక విధంగా చెప్పాలంటే చావో రేవో లాంటిది. అయితే గతంతో పోలిస్తే అధికార వైసిపి బలహీన పడిందన్న వాదన ఉంది. అందుకే వైసిపి ఇన్చార్జిలను మార్పు చేస్తుందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. విపక్ష టిడిపి, జనసేన ఉమ్మడిగా సాగుతూ ఉండడం.. అటు సోదరి షర్మిల కాంగ్రెస్ పగ్గాలు అందుకోనున్నారని తెలియడంతో జగన్ లో ఓ రకమైన కలవరం ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. అటు బిజెపి సైతం ఏపీ రాజకీయాలు తన చేతుల్లో ఉంచుకోవాలని చూస్తోంది. ఇలా ఎలా చూసినా ఈ ఏడాది రాజకీయాలు హీట్ పుట్టించనున్నాయి.
గత ఎన్నికల్లో 151 స్థానాలతో వైసిపి విజయభేరి మోగించింది. మధ్యలో స్థానిక సంస్థలతో పాటు అనేక ఎన్నికలు వచ్చాయి. వాటిలో కూడా ఏకపక్ష విజయాలే నమోదయ్యాయి. ఇక తనకు తిరుగు లేదనుకున్న జగన్ వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు సాగారు. కానీ ఇటీవల పరిస్థితులు చూస్తుంటే అంత ఈజీ కాదని తేలిపోయింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 60 సీట్లలో కొత్త అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. గెలుపు పై నమ్మకం లేక ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారని.. అటువంటప్పుడు 175 స్థానాలు ఎలా వస్తాయని ముప్పేట ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నెల రోజుల కిందట 11 మంది అభ్యర్థులను మార్చిన వైసీపీ హై కమాండ్.. రెండో జాబితాను ప్రకటించడానికి మాత్రం మల్లగుల్లాలు పడుతోంది. ఇవన్నీ వైసీపీపై ప్రతికూల పరిస్థితులను చూపిస్తున్నాయి.
జగన్ ను ఎలాగైనా గద్దె దించాలని చంద్రబాబు పవన్ తో చేతులు కలిపారు. జగన్ టార్గెట్ చేసుకొని ఆ ఇద్దరు నేతలు రాజకీయాలు ప్రదర్శిస్తున్నారు. టిడిపి, జనసేన కూటమిలోకి బిజెపి వస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. బిజెపి నిర్ణయం పైనే కాంగ్రెస్ భవితవ్యం ఆధారపడి ఉంది. బిజెపి కానీరాకుంటే.. తాను మద్దతు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ఆ కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపు పొందుతుందన్న అంచనాల ఉన్న పార్టీగా బిజెపి ఉండడంతో… చంద్రబాబు, పవన్ లు ఆ పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ముగ్గురం కలిస్తే 2014 ఫలితాలు రిపీట్ అవుతాయని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.అయితే పవర్ షేరింగ్ విషయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు.. ఆ రెండు పార్టీల మధ్య ఓటు షేరింగ్ పై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ఈ అంశంపై క్లారిటీ ఇస్తే కానీ జనసేన ఓట్లు టిడిపికి బదలాయింపు జరిగే అవకాశం కనిపించడం లేదు.
గతంలో వైసిపి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తాజాగా చంద్రబాబుతో చర్చలు జరిపారు. టిడిపికి పనిచేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా ఈ కొత్త ఏడాదిలోనే క్లారిటీ రానుంది. ఇక ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు వైఎస్ షర్మిల తీసుకుంటారన్న ప్రచారం ఉంది. వైసీపీలో కలవరపాటుకు కారణం అవుతోంది. షర్మిల ఎంట్రీ ముమ్మాటికీ జగన్ కి నష్టం చేకూర్చుతుంది. అందుకే ఆమె రాకుండా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆ ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదని టాక్ నడుస్తోంది. ఈ ఏడాది ఏపీ రాజకీయాల్లో షర్మిల కీలకం కానున్నారు. తెలంగాణలో ప్రయత్నించి విఫలమైన ఆమె.. ఇక్కడ సక్సెస్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో గెలుపు ఊపుతో ఉన్న ఆ పార్టీ… సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఎక్కువగా గెలుచుకుంటే మాత్రం షర్మిలకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో జగన్ కు ప్రతిబంధకంగా కూడా మారనుంది.