New Rule Implemented For Aadhar Card: దేశంలో ఓ వ్యక్తి గుర్తింపునకు ఆధార్ కార్డు కీలకంగా పనిచేస్తుంది. ప్రభుత్వ పథకాలకు, స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లకు, ఉపకార వేతనాలు పొందడానికి ఆధార్ తప్పనిసరి అయింది. తాజాగా బోగస్ ఓటర్లకు చెక్‌పెట్టడానికి ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆధార్ కార్డు కూడా ఓ నిత్యావసరంగానే మారింది. ప్రభుత్వ సేవలన్నీ ఆధార్ లింక్‌తోనే ఇస్తున్నారు. ప్రయివేటు సంస్థలు సైతం వ్యక్తి గుర్తింపు కోసం.. ప్రూఫ్‌గా ఆధార్ కార్డునే అడుగుతున్నాయి. ప్రజలు కూడా దానికి అలవాటు పడ్డారు.

2009 నుంచి జారీ..
యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) 2009లో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. పుట్టిన పిల్లాడికి కూడా ఆధార్ కార్డును జారీ చేస్తుంది. దీని కోసం వ్యక్తి యొక్క వివరాలతో దరఖాస్తు పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నకిలీ ఆధార్ కార్డులు కూడా కొంతమంది పొందారనే ప్రచారం సాగుతోంది. ఈనేపథ్యంలో నకిలీ కార్డుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని యూఐడీఏఐ నిర్ణయించింది. ఈమేరకు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకురానుంది.
ఇక ఎంపిక చేసిన కేంద్రాల్లోనే జారీ..
దేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారి ఆధార్ నమోదు ప్రక్రియ 100% పూర్తయిందని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా 134 కోట్ల ఆధార్ రిజిస్ట్రేషన్లు జరిగాయని వీరిలో అందరూ వయోజనులేనని పేర్కొన్నారు. 18 ఏళ్లు పైబడిన వారి ఆధార్ నమోదు పూర్తవ్వడంతో.. 5 సంవత్సరాలకు పైబడిన వారు కొత్తగా ఆధార్ కార్డు పొందేందుకు నిబంధనల్లో మార్పులు చేస్తోంది. గతంలో ఏ ఆధార్ కేంద్రంలో అయినా ఆధార్‌కు సంబంధించిన ఎటువంటి సేవలైనా పొందే వీలుండేది. ప్రస్తుతం 5 ఏళ్లు పైబడిన వారు ఆధార్ నమోదు ప్రక్రియను ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే చేసుకునేలా నిబంధనలు మారుస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశంలో ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే 5 ఏళ్లకు పైబడిన వారు ఆధార్ నమోదు చేసుకోవాలి. అయితే ఆధార్ అప్‌డేట్ మాత్రం అన్ని కేంద్రాల్లో చేసుకోవచ్చు. నకిలీ ఆధార్ కార్డుల ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండడంతో యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త నిబంధనలతో ఇబ్బందులు..
దేశ రక్షణ దృష్ట్యా కొత్త నిబంధనలు సరైనవే అయినా.. పరిమిత కేంద్రా కారణంగా ప్రజలు ఇబ్బంది పడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల వారికి కేంద్రం దూరంగా ఉంటే ప్రయాణం కష్టమవుతుందంటున్నారు. అదే విధంగా నిరక్ష్యరాస్యులైన తల్లిదండ్రులు ఉంటే కార్డు జారీకి ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు. తక్కువ కేంద్రాలకు అనుమతి ఇస్తే రద్దీ దృష్ట్యా కార్డు జారీ ఆలస్యమయే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ ఎలా అమలు చేస్తుంది, ఎన్ని కేంద్రాలకు అనుమతి ఇస్తుంది అన్నది చూడాలి.