
పార్టీ మీద విపరీతాభిమానంతో వ్యవస్థలను కించపరిచేలా చేస్తున్న వ్యాఖ్యలు కొత్త చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి. అధికార వైసీపీకి ఏడాది కాలంలో 60కి పైగా అంశాల్లో హైకోర్టు నుంచి మొట్టికాయలు పడ్డాయి. ఆయా అంశాల్లో ప్రభుత్వం చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించకపోవడమే అందుకు కారణం. అయితే వైసీపీ అభిమానులు, కార్యకర్తలు మాత్రం ఈ సున్నిత కారణాలను పట్టించుకోకుండా తమ ప్రభుత్వం, తమ నాయకుడికి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ పని చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టింగులకు దిగుతున్నారు. ఈ పరిణామాలు శృతి మించడంతో.. కోర్టు ధిక్కరణ కింద సుమోటోగా పరిశీలించాలని కోరుతూ హైకోర్టులో లక్ష్మీ నారాయణ అనే న్యాయవాది లేఖ రాశారు. ఇప్పటికే న్యాయస్థానంలో పదే పదే ఎదురుదెబ్బలు తగులుతున్న అధికార పక్షానికి ఈ వ్యవహారం అదనపు తలనొప్పిగా మారింది.
హైకోర్టు తీర్పులపై వైసీపీ నాయకుల వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైద్యుడు సుధాకర్ అరెస్ట్ చేసిన సందర్భంగా చోటు చేసుకున్న అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ ఎంపీ సురేష్ మీడియా సమావేశంలో కొన్ని ఆరోపణలు చేశారు. కోర్టులను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని, కోర్టు తీర్పులు ఈయనకు ముందే తెలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు పరోక్షంగా హైకోర్టుకు సంభందించినవిగా ఉన్నాయి. ఇదే అంశంపై ఆ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మీడియాతో మాట్లాడుతూ సుధాకర్ కేసు ఒక పెటీ కేసు అని, ఆ కేసుపై సీబీఐ విచారణ వేయడంపై యావత్ రాష్ట్రం విస్తుపోయిందని హైకోర్టు తీర్పుపై వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదంటూనే.. ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతోందని పేర్కొన్నారు. కరోనా లేకపోతే హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉండేవాడినని చెప్పుకొచ్చారు. చిన్న చిన్న కేసులకు కూడా సీబీఐ విచారణ చేపడితే ప్రతి పొలీస్‌స్టేషన్‌కు అనుబంధంగా సీబీఐ ఆఫీసులు పెట్టాల్సి ఉంటుందన్నారు.
మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు హైకోర్టు తీర్పులపై పెట్టిన పోస్టులు హైకోర్టు కించపరిచేవిగా ఉన్నాయి. ఏపీ హైకోర్టు మీద, జడ్జిల మీద దూషణలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై సుమోటోగా తీసుకోమని హైకోర్టు సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏపీలో ఇప్పుడు ప్రభుత్వానికి రెండు అపోజిషన్ లు అనే మాట గట్టిగా వినిపిస్తోందని, అందులో ఒకటి తెలుగుదేశం కాగా మరొకటి ఏపీ హైకోర్టు అని వైసీపీ మద్దతు దారులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారని తెలిపారు. ఆ పార్టీ నేతలే న్యాయస్థానాల తీర్పులపై అనుమానాలు కలిగించేలా మాట్లాడుతుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా హైకోర్టును, జడ్జ్ లను విపరీతమైన భాషతో ట్రోల్ చేస్తూ పోస్ట్లు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయం మీద పోస్టింగ్ లు చేసిన వారిపై కేసును సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం పదకొండు మంది సోషల్ మీడియాలో రాసిన స్క్రీన్ షాట్ లను ఆయన తన లేఖకు జత చేశారు. అందులో ఆయన నలుగురి పేర్లను ప్రస్తావించారు. ఈ లేఖను హైకోర్టు ఈ రోజు పరిశీలించే అవకాశం ఉంది. సుమోటోగా విచారణ చేపడితే వైసీపీ నేతలకు, సోషల్ మీడియా కార్యకర్తలకు ఇబ్బందులు తప్పవు.