తెలంగాణలో ఇప్పటికే పీసీసీ చీఫ్ రేస్ నడుస్తోంది. ఈ పదవికి అటు రేవంత్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి వెంకట రెడ్డి నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం వెంకటరెడ్డి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు వెంకటరెడ్డికి సోదరుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఇరుకున పడ్డట్లయింది. ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం అని.. తాను త్వరలో బీజేపీలో చేరుబోతున్నానని ప్రకటించేశారు. అంతేకాదు.. కోమటిరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంటారని కూడా చెప్పుకొచ్చారు.
Also Read: కేసీఆర్ రంగంలోకి దిగితే.. ఆ కిక్కే వేరప్పా
అంటే.. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల ప్రకారం.. పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్ లేదు కానీ, తన సోదరుడు మాత్రం పార్టీకి చీఫ్ కావాలని కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు వెంకటరెడ్డికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం వచ్చింది. రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి వేర్వేరు కాదు. ఇద్దరూ సోదరులు. వెంకటరెడ్డి నీడలోనే రాజగోపాల్ రెడ్డి ఎదిగారు. ఆయన చెప్పినట్లే రాజకీయం చేస్తారు. ఇద్దరూ రాజకీయంగా ఎలా బలపడాలన్న దానిపై పరస్పర వ్యూహాలు అమలు చేస్తుంటారు. ఇప్పుడు కూడా కోమటిరెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వకపోతే బీజేపీకి వెళ్లిపోతారన్న సంకేతాన్ని పంపడానికే.. అలా మాట్లాడారన్న చర్చలు కూడా కాంగ్రెస్‌లో ప్రారంభమయ్యాయి.
రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధం కాగా.. చాలా రోజుల క్రితమే బీజేపీ హైకమాండ్‌తో చర్చలు జరిపారు. తాను బీజేపీలో చేరితే.. మొత్తం పార్టీ పెత్తనాన్ని తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పట్లో ఆయన డిమాండ్లు చూసి బీజేపీ నేతలకు చిర్రెత్తుకొచ్చింది. ఆయనతో మాటలు తగ్గించేశారు. దీంతో కోమటిరెడ్డి కూడా వెనక్కి తగ్గారు. అయితే.. ఇప్పుడు బీజేపీ ఫుల్ స్వింగ్‌లో ఉంది. దీంతో అప్పటి డిమాండ్ల ప్రకారం లేకపోయినా రాజకీయ భవిష్యత్ అయినా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు.
Also Read: ఏపీలో బియ్యం డోర్ డెలివరీ మళ్లీ వాయిదా..? అందుకేనంట..!
రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా వీరు భావిస్తుండడంతో సోదరుల్లో ఎవరో ఒకరు అధికార పార్టీలో ఉంటారని.. వ్యూహం సిద్ధం చేసుకుని ఉండవచ్చనే అభిప్రాయాలు సైతం వెల్లడవుతున్నాయి. మొత్తంగా ఈ రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్ చూస్తుంటే కాంగ్రెస్‌పై బ్లాక్ మెయిలింగ్ రాజకీయం చేస్తున్నట్లే అనిపిస్తోందని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్‌కు పీసీసీ చీఫ్ ఇస్తే పార్టీ నుంచి వైదొలుగుతానని వీహెచ్ ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా రాజగోపాల్ రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటనేది అర్థం కాకుండా ఉంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్