Homeఆంధ్రప్రదేశ్‌AP: ఏపీలో కొత్త పొత్తులు.. జనసేనతో ‘లెఫ్ట్’

AP: ఏపీలో కొత్త పొత్తులు.. జనసేనతో ‘లెఫ్ట్’

AP:  వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు కూటమి కట్టే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త పొత్తులు వికసించే అవకాశాలున్నాయి. తాజాగా ఎమ్మెల్సి ఎన్నికల్లో టీడీపీ, లెఫ్ట్ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. పరస్పరం సహకరించుకోవాలని ఇరు పార్టీలు డిసైడ్ అయ్యాయి. ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలు, రెండు ఉపాధ్యాయస్థానాలకు ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. పట్టభద్రుల స్థానాలకు టీడీపీ అభ్యర్థులను పోటీలో పెట్టింది. కానీ ఉపాధ్యాయ స్థానాలకు మాత్రం పోటీచేయడం లేదు. వామపక్షాలు పీడీఎఫ్ కూటమిగా ఏర్పడి పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీచేస్తున్నారు. దీంతో అన్ని స్థానాలకు బహుముఖ పోటీ నెలకొంది. అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

సాధారణ ఎన్నికల కంటే ఎమ్మెల్సీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. విజయం సాధించాలంటే యాభై శాతం ఓట్లు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. కౌంటింగ్ ప్రక్రియ కూడా భిన్నంగా ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్య ఓట్లు ఉంటాయి. ఓటరు తనకు బాగా నచ్చిన వారికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి మిగిలిన వారికి రెండో ప్రాధాన్య ఓటు.. మూడో ప్రాధాన్య ఓటు వేయవచ్చు. ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్య ఓట్ల ద్వారా ఏ అభ్యర్థి గెలవకపోతే రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కిస్తారు. అక్కడకు తేలకుంటే మూడో ప్రాధాన్య ఓట్లు కూడా లెక్కిస్తారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలిచినట్లు ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్య ఓట్లు చాలినన్ని ఎవరికీ రాకపోతేనే మిగిలిన రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. అందుకే రెండో ప్రాధాన్య ఓట్లు కూడా కీలకంగా మారాయి. ఈ రెండో ప్రాధాన్య ఓట్లు పరస్పరం వేసుకోవాలని కమ్యూనిస్టులు , టీడీపీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ కలిసి రావడం దాదాపు లేనట్టేనని సంకేతాలు రావడంతో చంద్రబాబు కొత్త పొత్తులపైశర వేగంగా ఆలోచించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లిన ప్రజలు ఆదరించలేదు. ఓట్ల బదలాయింపు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. కాంగ్రెస్ ఓటు షేర్ వైసీపీకి కన్వర్ట్ అయ్యింది. అందుకే కాంగ్రెస్ తో లాభం లేదనుకొని తన పూర్వమిత్రులైన వామపక్షాలను దువ్వడం ప్రారంభించారు. ఒక వైపు బీజేపీ నేతలను సైకిలెక్కిస్తునే…మీరు కాకుండా వామపక్షాల రూపంలో గట్టి ప్రత్యామ్నాయం తమకుందని చంద్రబాబు ఢిల్లీ పెద్దలు స్పష్టమైన సంకేతాలు పంపారు.

వామపక్షాలు గత కొన్నిరోజులుగా జగన్ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని ఎండగడుతున్నాయి. పార్టీ అనుబంధ విభాగాలు గట్టిగానే పనిచేస్తున్నాయి. అయితే ఇంత చేస్తున్నా పొలిటికల్ మైలేజీ మాత్రం రావడం లేదు.ఈ నేపథ్యంలో వామపక్షాలు పునరాలోచనలో పడ్డాయి. రాజకీయంగా యాక్టివ్ కావాలంటే ప్రధాన పార్టీలతో పొత్తులుంటేనే సాధ్యమని కేంద్ర కమిటీ నాయకులు సైతం గుర్తించారు. స్థానిక అంశాలను దృష్టిలో పెట్టుకొని పొత్తులు పెట్టుకోవడానికి రాష్ట్ర నాయకత్వాలకు అనుమతిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తునకు సిద్ధపడ్డాయి. ఇక్కడ కానీ వర్కవుట్ అయితే మాత్రం సాధారణ ఎన్నికల్లో సైతం కంటీన్యూ అయ్యే చాన్స్ కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version