ముఖ్యమంత్రి కేసీఆర్ తనను విమర్శించి నోళ్లతోనే ఇప్పుడు జై..జైలు కొట్టుంచుకుంటున్నారు. గత సోమవారం భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 19మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. సంతోష్ బాబు తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందినవాడు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేసింది. సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ అన్నివిధలా అండగా ఉంటామని ప్రకటించారు.
కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి పాల్గొనకపోవడంపై ప్రతిపక్షాలతోపాటు తెలంగాణ ప్రజల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడి కేసీఆర్ ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ పలువురు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా పోరాటం చేసిన కేసీఆర్.. దేశం కోసం ప్రాణాలర్చిన తెలంగాణ వీరుడి అంత్యక్రియల్లో పాల్గొనకపోవడంపై తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది.
గతంలో సినిమా యాక్టర్లు చనిపోయినపుడు సీఎం కేసీఆర్ స్వయంగా వారి వద్దకు వెళ్లి పరామర్శించారని పలువురు గుర్తుచేశారు. సినిమా యాక్టర్లను గుర్తించిన కేసీఆర్ దేశం కోసం ప్రాణం ఆర్పించిన జవాను పట్ల ఇలా వ్యవహరించడంపై ప్రజల్లో ఒకింత అసహనం వ్యక్తమైంది. పత్రికల్లో, మీడియాల్లోనూ కేసీఆర్ వ్యవహార శైలిలో చర్చలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి భారీ సాయం ప్రకటించి విమర్శలు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5కోట్లతోపాటు ఇంటి స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1స్థాయి ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికెళ్లి సాయం అందిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా అమరులైన మరో 19మంది సైనికులకు కూడా సాయం ప్రకటించారు. ఒక్కో అమర జవాన్ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తామని స్పష్టం చేశారు.
కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకోనైనా సైనికులకు సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం సైనికులకు ఎల్లప్పుడు అండగా ఉంటుందనే సందేశాన్ని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు పంపించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దీంతో సీఎం కేసీఆర్ ను విమర్శించినోళ్లే ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.