Nellore YCP: నెల్లూరు వైసీపీలో నేతలు కట్టు దాడుతున్నారా? అధిష్టానం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారా? ఎవరికి వారే యమునా తీరులా వ్యవహరిస్తున్నారా? అధినాయకత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చినా పెడచెవిన పెడుతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇద్దరు నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న కాకాని గోవర్థన్ రెడ్డి, తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే దీనిపై గతంలో అధిష్టానం సీరియస్ అయ్యింది. ఇద్దర్నీ సీఎం క్యాంప్ ఆఫీస్ కు పిలిపించి.. మరీ క్లాస్ పీకినా ఇద్దరి తీరు మారలేదని ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తరగటం లేదు.

తాజాగా ఆత్మకూరు ఉప ఎన్నిక నామినేషన్ సందర్భంగా ఈ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అనిల్ కుమార్ యాదవ్ జగన్ కు వీర విధేయుడు. తొలి మంత్రివర్గంలోనే చోటు దక్కించుకున్నారు. అప్పట్లో సొంత సామాజికవర్గానికి పక్కనపెట్టి మరీ పదవి కేటాయించారు. దీంతో దీనిపై కాకాని గోవర్థన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తదితర రెడ్డి సామాజికవర్గ నేతలు కీనుక వహించారు. అప్పట్లో అనిల్ కాకానిల మధ్య గ్యాప్ అలానే ఉండిపోయింది. విభేదాలు పొడచూపాయి. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణలో అనిల్ పదవిని కోల్పోయారు. కాకాని అందిపుచ్చుకున్నారు. సీన్ రివర్స్ అయ్యింది. అవకాశం తనకు వచ్చింది అనుకున్నారేమో కానీ.. మంత్రి కాకాణికి తాను రెట్టింపు సహకారం అందిస్తామని అనిల్ కుమార్ సెటైర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో మంత్రి కాకాని స్వాగత ఫ్లెక్సీలను నెల్లూరు సిటీలో చించేశారు. ఇది అనిల్ వర్గం పనేనని అనుమానంతో విభేదాలు మరింత ముదిరాయి. అనిల్-కాకాణి వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. మంత్రిగా ప్రమాణం చేసిన తరువాత.. మొదటిసారిగా నెల్లూరుకు వస్తున్న సందర్భంగా గోవర్ధన్ రెడ్డి అనుచరులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇదే రోజున నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ పోటీ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో వివాదం మరింత ముదిరింది.
Also Read: AP CID: ఏపీలో డోసు పెంచి సీఐడీ… విపక్ష నేతలే లక్ష్యంగా నోటీసులు, కేసులు
పెద్దలు జోక్యం చేసుకున్నా..
ఇద్దరి నేతల తీరుతో పార్టీ పరువు బజారున పడుతోందని అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ విషయంపై అప్పట్లో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఎవరూ విమర్శలు చేసుకోకుండా సభలు నిర్వహించుకోవాలని సర్ది చెప్పారు. తరువాత సీఎం జగన్ స్వయంగా కాకాణి.. అనిల్ కుమార్ యాదవ్‌లతో ప్రత్యేకంగా సమావేశమై సర్ది చెప్పారు. కలిసికట్టుగా పని చేయాలని.. పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఆ తరువాత ఇద్దరు నేతలు సైలెంట్ గానే కనిపించారు. అంతా సర్దుకుంది అనుకుంటున్న సమయంలో మళ్లీ విబేధాలు తెరపైకి వచ్చాయి. నెల్లూరులో మంత్రి కాకాణి నిర్వహిస్తున్న అధికారిక సమావేశాలకు అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడం లేదు.తాజాగా అనిల్ కుమార్ యాదవ్‌తో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జత కట్టారని ప్రచారం ఉంది. కాకాణికి మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి ఆయనపై ప్రసన్న కుమార్ రెడ్డి గుర్రుగానే ఉన్నారు. సీఎం ఆదేశాల మేరకు అనిల్ కుమార్..ప్రసన్న కుమార్ రెడ్డిల ఇళ్లకు కాకాణి వెళ్లి సహకరించలని కోరారు. కానీ వాళ్ళు మాత్రం విరోధ ధోరణిలోనే కొనసాగుతున్నారని వైసీపీ వర్గాల్లో టాక్. ప్రసన్న కుమార్ రెడ్డి కూడా కాకాణి నిర్వహిస్తున్న సమావేశాలకు రావడం లేదు. ఆయన అనుచరులు కొందరు అధికారిక పదవుల్లో ఉన్నా వారు కూడా కాకాణికి దూరంగానే ఉంటున్నారు.
ముఖం చాటేస్తున్న నాయకులు..
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల పర్వం పూర్తయ్యింది. ఈ ఎన్నికల్లోనైనా నేతలు కలిసికట్టుగా పని చేస్తారని భావించారు. అక్కడా కూడా ఒకరికొకరు అంటనట్టు.. ముట్టనట్టు వ్యవహరించారు. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆత్మకూరుకు సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విక్రమ్ రెడ్డి నామినేషన్‌లో పాల్గొనేందుకు అనిల్ కుమార్ యాదవ్.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు ఆలయం దగ్గరకు వచ్చారు. ఇదే సమయంలో మంత్రి కాకాణి కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారనే సమాచారం అందింది.

కాకాణి వస్తే ఆయనతో మాట్లాడాల్సి వస్తుందనో లేక మంత్రిగా ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం మర్యాద ఇవ్వాల్సి వస్తుందనో.. ఏమో అభ్యర్థిని హడావుడిగా అభినందించి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనకుండా అనిల్.. ప్రసన్నకుమార్‌లు నెల్లూరుకు వెళ్లిపోయారు. పార్టీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహార శైలి శైతం అనుమానంగా ఉంది. ఆయన కుమార్తె టీడీపీ గూటికి చేరడంతో వచ్చే ఎన్నికల నాటికి ఆనం కూడా కుమార్తె బాట పడతారన్న టాక్ నడుస్తోంది. మరో వైపు మేకపాటి విక్రమ్ రెడ్డి చిన్నాన్న…ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు ప్రక్రయకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలంలో చంద్రశేఖర్ రెడ్డికి గట్టి పట్టు ఉంది. ఆయన నామినేషన్‌కు రాకపోవడంతో ఎన్నికలలో ఏ మాత్రం సహకరిస్తారనే విషయంపై అనుమానాలు ఉన్నాయి. అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డితో ఉన్న విభేదాల వల్లే చంద్రశేఖర్ రెడ్డి రాలేదని భావిస్తున్నారు. అయితే ఎన్నడూ లేనంతగా నెల్లూరు వైసీపీలో విభేదాల పర్వం నడుస్తుండడంతో అధిష్టానానికి కలవరపాటుకు గురిచేస్తోంది.
Also Read:AP SSC Results: టెన్త్ పూర్ రిజల్ట్స్.. కొవిడ్ కారణం చెప్పి తప్పించుకున్న ప్రభుత్వం