Kotam Reddy vs YCP : వైసీపీ హైకమాండ్ కు ఇప్పుడు నెల్లూరు రాజకీయాలు గుదిబండగా మారాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు రాజకీయాలు ఆ పార్టీ గుప్పెట్లో ఉన్నాయి. ఇప్పుడవి చేజారుతున్నాయి. ఇప్పటికే ఆనం రామనారాయణరెడ్డి పార్టీకి దూరమయ్యారు. కోటంరెడ్డి తెగ చికాకు పెడుతున్నారు. దీనిని నుంచి ఎలా బయటపడాలో తెలియక హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. వారిద్దరి బాటలోనే ఇప్పుడు నెల్లూరు నగర మేయర్ స్రవంతి కూడా పార్టీకి, ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. తాను కోటంరెడ్డి బాటలోనే నడుస్తానని ప్రకటించి ప్రకంపనలు సృష్టించారు. కోటంరెడ్డి కోసం తన పదవిని తృణప్రాయంగా వదులుకుంటానని కూడా ప్రకటించారు. ఎన్ని బెదిరింపులు, ప్రలోభాలు చేసినా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. తనకు ఎవరూ ఫోన్లు చేయవద్దని.. తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని.. మీడియా ద్వారా ప్రభుత్వ పెద్దలు, పార్టీ ప్రజాప్రతినిధులకు తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నగర మేయర్ గా పొట్లూరి స్రవంతి ఎంపికయ్యారు. అయితే ఆమె ఆది నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫాలోవర్ గా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ హైకమాండ్ పై కోటంరెడ్డి తిరుగుబావు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. తన ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలతో కలకలం రేపారు. అనుమానం ఉన్నచోట తాను ఉండలేనని చెప్పి బయటకు వచ్చారు. దీంతో హైకమాండ్ కోటంరెడ్డికి ప్రత్యామ్నాయంగా నాయకత్వం తయారుచేసే పనిలో పడింది. ఆయన వెంట నడిచేవారిని నిలువరించే ప్రయత్నం చేస్తోంది. అయితే కీలకమైన నగర మేయర్ స్రవంతి మాత్రం హైకమాండ్ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. తాను కోటంరెడ్డి వెంటనే నడుస్తానని స్పష్టం చేశారు. శ్రీధర్ అన్నతోనే తమ రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని చెప్పి హైకమాండ్ ప్రయత్నాలను తిప్పికొట్టారు. కోటంరెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

అయితే కోటంరెడ్డి ఎపిసోడ్ ను హైకమాండ్ లైట్ తీసుకుంది. పేర్ని నాని, కొడాలి నాని వంటి వారు అయితే ఒక అడుగు ముందుకేసి కోటంరెడ్డి లాంటి వారు బయటకు వెళ్లిపోవడమే మేలన్న రీతిలో మాట్లాడారు. జగన్ బలంతో గెలిచావు అంటూ గేలి చేశారు. అయితే ఏకంగా నగర మేయర్ స్రవంతి తన రాజకీయ ఉన్నతికి కోటంరెడ్డే కారణమని చెప్పుకు రావడం హైకమాండ్ కు, కోటంరెడ్డిపై విమర్శలు చేసేవారికి మింగుడుపడడం లేదు. ఈ పరిణామాలను వారు ఊహించలేదు. ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు కోటంరెడ్డి బాటలోనే ఉన్నారు. కానీ బయటపడడం లేదు. వారికి రకరకాలుగా ప్రలోభాలు గురిచేస్తుండడం, కేసులు పెడతామని హెచ్చిరికలతో వెనక్కి తగ్గుతున్నారు. అటు కోటంరెడ్డికి భద్రత తగ్గించడంతో పాటు ఏకంగా ఓ కార్పొరేటర్ కిడ్నాప్ నకు యత్నించారని కేసు నమోదుచేశారు. అయితే ఏకంగా నగర మేయరే బహిరంగంగా ముందుకొచ్చి కోటంరెడ్డికి మద్దతు ప్రకటించడంతో అవన్నీ అవాస్తవాలేనని తేలిపోయింది.
అయితే ఈ పరిణామాల వెనుక పక్కా వ్యూహంతో కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ముందుకు సాగుతున్నట్టు పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం తాజా, మాజీ మంత్రులు కాకాని గోవర్థన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అదే సమయంలో కోటంరెడ్డి, అనిల్ కుమార్ మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే ఫోన్ ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో బయటకు వచ్చిన కోటంరెడ్డి పార్టీ హైకమాండ్ తో పాటు సజ్జల రామక్రిష్ణారెడ్డి, మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డిలను టార్గెట్ చేసుకున్నారు. కానీ అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ తెరపైకి వచ్చారు. కోటంరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే. నగరంపై ఆయనకు పట్టు ఉండాలి. కానీ కోటంరెడ్డి పట్టు సాధించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకానికి వ్యతిరేకంగా అనిల్ కోటంరెడ్డికి ప్రోత్సాహమందిస్తున్నారన్న అనుమానాలున్నాయి. ఈ పరిణామాల క్రమంలో ఏకంగా నగర మేయర్ కోటంరెడ్డికి మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తమకు జెండా, అజెండా అంటూ ఏమీలేదని.. కోటంరెడ్డే తమకు ముఖ్యమని ప్రకటించడం వైసీపీ హైకమాండ్ కు మైండ్ బ్లాక్ అయ్యింది,